కొడుకు అరెస్ట్‌ని అడ్డుకునేందుకు పోలీసులపై Excavator తో దాడి యత్నం.. Viral video

ABN , First Publish Date - 2022-06-28T01:37:44+05:30 IST

కడుపున పుట్టినవాడు కళ్ల ముందే అరెస్టవుతుంటే తల్లిదండ్రుల హృదయాలు చలించక మానవు. చేసింది తప్పే అయినా కొడుకువైపే అమ్మనాన్నలు నిలబడతారని చెప్పేందుకు చక్కటి ఉదాహరణ లాంటి ఘటన ఒకటి అమెరికాలోని వెర్మోంట్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

కొడుకు అరెస్ట్‌ని అడ్డుకునేందుకు పోలీసులపై Excavator తో దాడి యత్నం.. Viral video

వెర్మోంట్, అమెరికా : కడుపున పుట్టినవాడు కళ్ల ముందే అరెస్టవుతుంటే తల్లిదండ్రుల హృదయాలు చలించక మానవు. చేసింది తప్పే అయినా కొడుకువైపే అమ్మనాన్నలు నిలబడతారని చెప్పేందుకు అమెరికాలోని వెర్మోంట్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఓ ఘటన సజీవసాక్ష్యంగా నిలిచింది. దాడి, దోపిడీ కేసులో ఓ యువకుడిని అరెస్ట్ చేసేందుకు హార్డ్‌విక్‌(Hardwick)లోని అతడి ఇంటికి వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారులకు ఊహించని అనుభవం ఎదురైంది. అరెస్టును అడ్డుకునేందుకు నిందితుడి తల్లిదండ్రులు విశ్వప్రయత్నాలే చేశారు. నిందితుడి తండ్రి నిర్మాణ పనుల్లో వినియోగించే ఎక్స్కావేటర్(excavator)తో తిరగబడ్డాడు. ఎక్స్కావేటర్‌తో పోలీసుపై దాడికి యత్నించాడు. దీంతో ఆఫీసర్లు షాక్‌కు గురయ్యారు. మరోవైపు నిందితుడి తల్లి కూడా పోలీసులను నిలువరించేందుకు ప్రయత్నించింది. కొడుకుని అరెస్ట్ చేయకుండా అడ్డుపడింది. ఈ సమయంలో పోలీసులతో ఆమె కుస్తీపట్లు పట్టింది. అయినప్పటికీ ఏమాత్రం నెరవకుండా నిందిత యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఘటన దృశ్యాలు డాష్‌కామ్ కెమెరాలో రికార్డయ్యాయి. ఫేస్‌బుక్‌లో పోలీసులు షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. 


ఈ వీడియో క్లిప్‌లో నిందితుడి తండ్రి ఎక్స్కావేటర్‌తో పోలీసులపై దాడికి యత్నించడం స్పష్టంగా కనిపించింది. నిర్ఘాంతపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ తన తుపాకీని నిందిత తండ్రివైపు గురిపెట్టాడు. కానీ సంయమనం కోల్పోలేదు. కాల్పులు జరపలేదు. ఈ వైరల్ వీడియోకి తక్కువ వ్యవధిలోనే 564,000 వ్యూస్, వేలాది కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్ స్పందిస్తూ.. ‘‘ వావ్.. ఈ పోలీసు అధికారులు గొప్ప సంయమనం పాటించారు’’ అని ప్రశంసించాడు. మరో యూజర్ స్పందిస్తూ.. ‘‘ కాల్పులు జరిపేందుకు అవకాశం ఉన్నా... పోలీసులు నిగ్రహంతో వ్యవహరించారు’’ అని అన్నారు. అందరూ క్షేమంగానే ఉండడం నిజంగా సంతోషకరమని, ఆఫీసర్లకు ధన్యవాదాలు అని పలువురు కామెంట్ చేశారు. 


అదృష్టవశాత్తూ తమ అధికారులకు ఎలాంటి హానీ జరగలేదని వెర్మోంట్ స్టేట్ పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలవ్వకుండానే అరెస్ట్‌లు చేయగలిగారని వివరించారు. దాడి, దోపిడీ కారణంగా నిందిత యువకుడు, అరెస్ట్ నిరోధం కారణంగా అతడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి యత్నించినందుకుగానూ నిందిత తండ్రిపై కేసు నమోదయ్యిందన్నారు.  నిందిత మహిళ(తల్లి) కోర్ట్ ముందు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.Updated Date - 2022-06-28T01:37:44+05:30 IST