స్టార్లతో జెలెన్స్కీ డాన్స్ వీడియో వైరల్
ABN , First Publish Date - 2022-02-27T22:08:22+05:30 IST
ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రష్యా బలగాల దాడులను ఉక్రెయిన్..
కీవ్: ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రష్యా బలగాల దాడులను ఉక్రెయిన్ దళాలు శక్తివంచన లేకుండా ప్రతిఘటిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ''దాడుల నుంచి విముక్తి లభించేంత వరకూ పోరాడుతూనే ఉంటాం''అంటూ ప్రజలను, బలగాలను ఉత్సాహ పరుస్తూ రష్యాపై పోరుకు సారథ్యం వహిస్తున్నారు. భద్రత కోసం దేశం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామన్న అమెరికా సూచనలను చేసినా ఆయన పట్టించుకోవడం లేదు. 'మాకు ఆయుధాలు అవసరం' అని మాత్రమే తెగేసి చెబుతున్నారు.
ఈ తాజా పరిణామాలకు ముందు...అంటే.. ఒకింత ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే... ఉక్రెయిన్‌లో వినోద ప్రపంచాన్ని (ఎంటర్టైన్మెంట్ రంగం) ఉర్రూతలూగించిన వారిలో జెలెన్స్కీ ఒకరు. 2010లో 'సర్వెంట్ ఆఫ్ ది పీపుల్' టీవీ సిరీస్‌లో టాప్ పెర్ఫార్మింగ్ ఆరిస్టుగా జెలెన్స్కీ పేరు తెచ్చుకున్నారు. 2006లో 'డాన్సింగ్ విత్ ది స్టార్స్' ఉక్రెయిన్ వెర్షన్లో జెలెన్స్కీ పాల్గొన్నారు. ఈ రియాల్టీ టీవీ షో డెబట్ సీజన్లో ఆయన విజేతగా కూడా నిలిచారు. ఈ సమయంలో ఆయన ఒలెనా షాప్టెంకోతో కలిసి ప్రదర్శించిన డాన్స్ అందర్నీ అబ్బురపరచింది. ఇప్పుడు ఆ వీడియో మళ్లీ బయటకు వచ్చింది. వచ్చీ రావడంతోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్లో పోస్ట్ అయినప్పటి నుంచి 10 లక్షలకు పైగానే వ్యూస్ సంపాదించుకుంది. నెటిజన్లు జెలెన్స్కీ డాన్స్ చూసి ఫిదా అయిపోతూ...''భలే వాడివి ప్రెసిడెంట్ బాసూ'' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.