Opsకు షాక్

ABN , First Publish Date - 2022-07-10T13:53:34+05:30 IST

అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం జరిగేందుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఏకనాయకత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం

Opsకు షాక్

- ఈపీఎస్‌ వర్గంలో చేరిన తేని జిల్లా సభ్యులు

- హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

- నేడు చెన్నైకి అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సభ్యుల రాక


చెన్నై, జూలై 9 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం జరిగేందుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఏకనాయకత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం సాగిస్తున్న నాయకుడు ఒ. పన్నీర్‌సెల్వంకు తేని జిల్లా నేతలు షాక్‌ ఇచ్చారు. ఆ జిల్లాకు చెందిన తొమ్మిది మంది సర్వసభ్యమండలి సభ్యులు ఊహించని విధంగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గంలో చేరారు. తమ సంపూర్ణ మద్దతు ఎడప్పాడికేనంటూ ప్రకటించారు. దీంతో సర్వసభ్యమండలిలో ఎడప్పాడి మద్దతుదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. శుక్రవారం వరకూ ఆయన వర్గంలో 2432 మంది సర్వసభ్యమండలి సభ్యులు ఉన్నారు. తాజాగా తేని జిల్లాకు చెందిన సర్వసభ్యమండలి సభ్యులు మాజీ ఎంపీ పార్తీబన్‌, అరుణ్‌కుమార్‌, బాలచందర్‌, ధనలక్ష్మి చొక్కలింగం, కరికాలన్‌, దయాళన్‌ సహా తొమ్మిదిమంది ఎడప్పాడిని కలుసుకుని ఆయనకు మద్దతు ప్రకటించారు. దీంతో ఎడప్పాడివర్గంలోని సర్వసభ్యమండలి సభ్యుల సంఖ్య 2441కి పెరిగింది. ఇలాతన సొంత జిల్లాకు చెందిన నేతలు సైతం ఎడప్పాడి వర్గంలో చేరడంపై పన్నీర్‌సెల్వం దిగ్ర్భాంతి చెందారు.


హైకోర్టు తీర్పుపై సస్పెన్స్‌

సర్వసభ్యమండలి సమావేశంపై స్టే విధించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం దాఖలు చేసి న పిటిషన్‌పై ఆ సమావేశం జరగటానికి పావుగంట ముందు తీర్పు వెలువడే పరిస్థితి ఉండటంతో ఇరువర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.తమకుసానుకూలంగానే తీర్పు వస్తుందని ఇరువర్గాలు భావిస్తున్నాయి. సర్వసభ్యమండలిపై స్టేవిధించటంఖాయమన్న ధీమాతో పన్నీర్‌సెల్వం వర్గీయులు శుక్రవారం సాయంత్రం ఆయన నివాసగృహం వద్ద సందడి చేశారు. ఓపీఎస్‏కు మద్దతుగా నినాదాలు చేశారు. అదే సమయంలో సర్వసభ్యమండలికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందని ఈపీఎస్‌ వర్గీయులు ధీమాను ప్రదర్శిస్తున్నారు. సర్వసభ్యమండలి నిర్వహణకు తుది ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. ఇక పార్టీ శ్రేణుల్లో మాత్రం హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సర్వసభ్యమండలి నిర్వహణకు అనుమతి లభిస్తుందా? చివరి క్షణంలో స్టే విధిస్తారా?అని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. హైకోర్టు తీర్పుపై నెలకొన్న సస్పెన్స్‌ను పార్టీ శ్రేణులు భరించలేకపోతున్నారు.


నేడు చెన్నైకి సభ్యుల రాక

ఇదిలా ఉండగా పార్టీ అధిష్ఠానవర్గం ఆదేశాల మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి అన్నాడీఎంకే సర్వసభ్యమండలిసభ్యులు ఆదివారం చెన్నైకి  విచ్చేయనున్నారు. ఇప్పటికే రామనాథపురం, కన్నియాకుమారి, తిరునల్వేలి తదితర సుదూర ప్రాంతాలకు చెందిన సర్వసభ్యమండలి సభ్యులు శనివారం సాయంత్రమే నగరానికి చేరుకుని స్థానిక నాయకుల ఇళ్ళ వద్ద, హోటళ్లలో బసచేస్తున్నారు. సోమవారం వానగరం శ్రీవారు వేంకటాచలపతి కల్యాణమండపంలో జరుగనున్న సర్వసభ్యమండలి, కార్యాచరణ మండలి సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చే సభ్యులందరికీ బార్‌కోడ్‌ కలిగిన గుర్తింపు కార్డులను ఇదివరకే పంపిణీ చేశారు. ఆ గుర్తింపు కార్డులను మరచిపోకుండా తీసుకురావాలని ఎడప్పాడి సర్వసభ్యమండలి సభ్యులందరికీ ఉత్తర్వు జారీ చేశారు.


ఈపీఎస్‏కు చిక్కులు తొలగేనా?

ఏకనాయకత్వం వివాదం పుణ్యమా అని అన్నాడీఎంకేలో పార్టీ శ్రేణులంతా తనవైపేనని నిరూపించుకోగలిగిన ఎడప్పాడి ప్రస్తుతం మూడు ప్రధానమైన చిక్కుల నుంచి బయటపడాల్సి వుంది. సర్వసభ్యమండలి సమావేశానికి వ్యతిరేకంగా పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఆయనకు సానుకూలంగా వెలువడాల్సి వుంది. అదే జరిగితే ఆయన ప్రధాన సమస్య నుంచి బయటపడ్డట్లే. ఇక రెండో చిక్కు ఏదంటే 2018లో డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి తనపై దాఖలు చేసిన అవినీతి అక్రమాల కేసు నుంచి బయటపడాల్సి వుంది. ఈ సమస్య ప్రస్తావనకు రావటానికి కారణం ఆ కేసును సవాలు చేస్తూ ఈపీఎస్‌ వేసిన అప్పీలు పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరుగనుండటమే. ఈపీఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రహదారుల నిర్మాణానికి సంబంధించి టెండర్ల కేటాయింపుల్లో రూ.4800 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఆర్‌ఎస్‌ భారతి హైకోర్టులో కేసు వేశారు. తొలుత ఈ కేసును ఏసీబీ విచారణ జరిపేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి స్వీయపర్యవేక్షణలోని ఏసీబీ సక్రమంగా విచారణ జరుపదని ఫిర్యాదు చేయడంతో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ అవినీతి కేసు నుంచి కూడా ఈపీఎస్‌ బయటపడాల్సి ఉంది. ఇక తన మద్దతుదారులైన మాజీ మంత్రులపై డీఎంకే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏసీబీ తనిఖీలను చట్టపరంగా ఎదుర్కోవటం కూడా ఈపీఎ్‌సకు మూడో ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. ఈ మూడు చిక్కుల నుంచి బయటపడేందుకు ఈపీఎస్‌ తగు ప్రయత్నాలు చేపడుతున్నారు.


ఇక ఓపీఎస్‏కు దూరమే

పార్టీలో జరుగుతున్న తాజా పరిమాణాలపై ఎడప్పాడి వర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడొకరు మాట్లాడుతూ పార్టీకి కళంకం తెచ్చిన ఓపీఎ్‌సను పార్టీ నుంచి దూరం చేయడం ఖాయమని తెలిపారు. సర్వసభ్యమండలిలో ఓపీఎస్‏ను పార్టీ నుంచి తొలగించబోమని, అయితే ఈపీఎస్‏ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకోవడం ఖాయమని తెలిపారు. సోమవారం జరిగే సర్వసభ్యమండలి తాము అనుకున్నట్లు సవ్యంగా జరిగితే ఆ తర్వాత ఓపీఎస్‏ను పార్టీ నుంచి తొలగించే విషయంపై ఈపీఎస్‌ సభ్యులందరితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Updated Date - 2022-07-10T13:53:34+05:30 IST