Nupur Sharma కు థానే పోలీసులు సమన్లు
ABN , First Publish Date - 2022-06-08T00:46:38+05:30 IST
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండయిన ఆ పార్టీ ప్రతినిధి..
ముంబై: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండయిన ఆ పార్టీ ప్రతినిధి నూపుర్ శర్మకు థానె పోలీసులు సమన్లు పంపారు. ఈనెల 22న తమ ముందు హాజరుకావాలంటూ ముంబ్రా పోలీసులు మెయిల్, పోస్ట్ ద్వారా సమన్లు పంపారు. ముంబ్రా పోలీస్ స్టేషన్లోనే కాకుండా ముంబై పైధోని పోలీస్ స్టేషన్లోనూ నుపుర్‌పై కేసు నమోదైంది.
మరోవైపు, తనను చంపుతామంటూ బెదరింపు కాల్స్ వస్తున్నాయని నుపుర్ శర్మ చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు ఆమెకు భద్రత కల్పించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ఇప్పటికే పలు ముస్లిం దేశాలు నిరసనలు తెలిపాయి. ఈ వివాదంపై వెంటనే బీజేపీ చర్యలకు దిగింది. నుపుర్ శర్మతో పాటు పార్టీ ఢిల్లీ యూనిట్ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.