NITI Aayog meeting: మమత అలా... కేసీఆర్ ఇలా...

ABN , First Publish Date - 2022-08-07T19:18:21+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు.

NITI Aayog meeting: మమత అలా... కేసీఆర్ ఇలా...

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి (NITI Aayog Governing Council meeting) తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీ (mamata banerjee) హాజరయ్యారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ఆమె ఉత్సాహంగా పాల్గొనడమేకాక తన అభిప్రాయాలను, సూచనలను కేంద్రానికి వెల్లడించారు.


వాస్తవానికి మమత రెండ్రోజుల ముందే న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో ఎస్ఎస్‌సీ స్కామ్‌ (bengal ssc scam) లో మాజీ మంత్రి పార్థా చటర్జీ (partha chatterjee), ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీ (arpitha mukherjee) ఈడీ (enforcement directorate)కి పట్టుబడి కలకలం రేగిన ప్రస్తుత తరుణంలో ఆమె ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మమత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒకరిద్దరు తప్ప టీఎంసీ ఎంపీలంతా ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. తమ రాష్ట్ర గవర్నర్‌గా ఉండి ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ధన్‌కర్‌ను ప్రకటించినందుకు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తద్వారా ఎన్డీయే అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉన్నా ఆమె కీలకంగా వ్యవహరించారు.


సాధారణంగా బీజేపీ పేరు చెప్పినా, మోదీ పేరెత్తినా మండిపడే మమత ప్రస్తుత ఢిల్లీ టూర్‌లో కూల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె దూకుడుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కూడా ఆమె ప్రశాంతంగానే ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో తృణమూల్ కీలకంగా వ్యవహరించి తమ పార్టీ అభ్యర్ధినే బరిలో దించి, మిగతా యూపిఏ పక్షాల మద్దతు కూడగట్టారు. కాంగ్రెస్‌ కూడా మరో గత్యంతరం లేక యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయానికి కాంగ్రెస్ తమను సంప్రదించలేదంటూ మమత మెలిక పెట్టారు. చివరకు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 


2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో పాటు, ప్రతిపక్షాల అనైక్యత కారణంగా ఆమె ప్రస్తుతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే కోణం కన్నా ఆచితూచి అడుగువేయడం బెటర్ అని ఆమె వ్యవహారశైలి తెలియజేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.

      

మమత పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao) పరిస్థితి మరో రకంగా ఉంది. కొంత కాలంగా ఆయన బీజేపీతో తలపడుతున్నారు. ముఖ్యంగా స్థానిక నాయకత్వం కన్నా జాతీయ స్థాయిలో ఉన్న కమలనాథులపై వాగ్భాణాలు ఎక్కువగా సంధిస్తున్నారు. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోటే ఢీ కొంటున్నారు. మోదీపై, ఆయన విధానాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందులో భాగంగానే నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారు. నిన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ నీతి ఆయోగ్ సమావేశాలతో ప్రయోజనమే లేదని తేల్చేశారు. 2019 జూలై తర్వాత మొదటిసారిగా భౌతికంగా జరిగిన ఈ సమావేశంలో.. నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం.. జాతీయ విద్యా విధానం తదితర కీలకాంశాలపై చర్చ జరుగుతున్నా కేసీఆర్ గైర్హాజరయ్యారు.


మరోవైపు మరో ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోతున్నందుకే కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందనే సర్వేల నేపథ్యంలో ఆయన కమలనాథులపై ఒంటికాలిపై లేస్తున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఇటీవలి దాకా అచ్చం మమత వ్యవహరించినట్లుగానే కేసీఆర్ కూడా మోదీపై మండిపడుతున్నారు. గతంలో మమతకు, ప్రస్తుతం కేసీఆర్‌కు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ (prashant kishor) ఇచ్చిన సలహామేరకే ముఖ్యమంత్రి కమలనాథులపై దూకుడుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మోదీ రెండోసారి గెలిచాక కూడా సఖ్యతగా ఉన్న కేసీఆర్ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వంతో తలపడుతున్నారు. బలమైన బీజేపీని ఎదుర్కొంటోన్న లోకల్ పార్టీగా ప్రజల్లో సెంటిమెంట్ వచ్చేలా టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 


బీజేపీపై, మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడం ద్వారా పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ మెరుగైన ఫలితాలు సాధించినట్లుగానే తమకూ కలిసి వస్తుందని టీఆర్ఎస్‌ అధినాయకత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ అంచనాలు ఏ మేరకు నెరవేరతాయో త్వరలోనే తేలనుంది.  

Updated Date - 2022-08-07T19:18:21+05:30 IST

Read more