సహజవాయువు ధరలు 40% పెంపు

ABN , First Publish Date - 2022-10-01T07:18:50+05:30 IST

విద్యుదుత్పత్తికి, ఎరువుల తయారీకి వాడే సహజవాయువు ధరలను 40ు మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సహజవాయువు ధరలు 40% పెంపు

పెరగనున్న సీఎన్‌జీ, పైప్‌డ్‌ వంటగ్యాస్‌ ధరలు

2019 ఏప్రిల్‌ నుంచి పెంచడం ఇది మూడోసారి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: విద్యుదుత్పత్తికి, ఎరువుల తయారీకి వాడే సహజవాయువు ధరలను 40ు మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సహజవాయువును కంప్రెస్‌ చేసినప్పుడు అది వాహనాలను నడపడానికి (కంప్రెస్డ్‌ నాచురల్‌ గ్యాస్‌-సీఎన్‌జీగా), వంట గ్యాసుగా (పైప్డ్‌ వంటగ్యా్‌స-పీఎన్‌జీ) ఉపయోగపడుతుంది. కేంద్రం నిర్ణయంతో ఆ రెండింటి ధరలూ పెరగనున్నాయి. నిజానికి ఎరువుల ధరలు కూడా పెరగాలిగానీ.. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఆ భారం ఎరువులను కొనుగోలు చేసేవారిపై పడదు. చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ (పీపీఈసీ) ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం.. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల పాత క్షేత్రాల నుంచి వెలికితీసే సహజవాయువుకు (పదిలక్షల బ్రిటిష్‌ ధర్మల్‌ యూనిట్లకుగాను) ప్రస్తుతం ఉన్న 6.1 డాలర్ల ధరను 8.57 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే.. కొత్త క్షేత్రాలు, చమురు వెలికితీత క్లిష్టమైన క్షేత్రాల (కృష్ణా గోదావరి బేసిన్‌లో రిలయన్స్‌, బ్రిటిష్‌ పెట్రోలియం కలిసి నిర్వహిస్తున్న డీప్‌ సీ డీ6 బ్లాకు వంటివాటి) నుంచి తీసే సహజవాయువుకు ప్రస్తుతం ఉన్న 9.92 డాలర్ల ధరను 12.6 డాలర్లకు పెంచింది. 2019 ఏప్రిల్‌ నుంచి సహజవాయువు ధరల పెంపు ఇది మూడోసారి. ఇప్పటికే సామాన్యుడి నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం.. ఈ పెంపుతో మరింత పెరిగే ప్రమాదం ఉంది.


ఏటా రెండుసార్లు..

సహజవాయువు ధరలను కేంద్రం ఏటా రెండుసార్లు.. ఏప్రిల్‌ 1 నుంచి, అక్టోబరు 1న వర్తించేలా సవరిస్తుంది. అది కూడా గ్యాస్‌ మిగులు దేశాలైన అమెరికా, కెనడా, రష్యా వంటి దేశాల్లో గత త్రైమాసికం మినహా ఏడాది కాల సగటు ఆధారంగా నిర్ణయిస్తుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఆయా దేశాల్లో 2021 జూలై నుంచి 2022 జూన్‌ దాకా ఉన్న ధర (ఏడాది కాల) సగటు ఆధారంగా మనదేశంలో 2022 అక్టోబరు 1 (శనివారం) నుంచి 2023 మార్చి 31 దాకా ఏ ధర ఉండాలో నిర్ణయిస్తుందన్నమాట. ఆ దేశాల్లో గత మూడునెలల (2022 జూలై, ఆగస్టు, సెప్టెంబరు) ధరలను పరిగణనలోకి తీసుకోదు.

Read more