రష్యాను చూసి నాటో భయపడుతోంది: జెలెన్‌స్కీ
ABN , First Publish Date - 2022-03-22T21:19:26+05:30 IST
రష్యాను చూసి నాటో భయపడుతోందని జెలెన్‌స్కీ మరోసారి ఆరోపించారు. తాము అంటున్న మాటను ..

కీవ్: రష్యాను చూసి నాటో భయపడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి ఆరోపించారు. తాము అంటున్న మాటను అమెరికాతో సహా 30 దేశాల సైనిక కూటమి అంగీకరిస్తుందో, లేదో చెప్పాలని కోరారు. ఇందులో నిజం ఏమిటో బహిరంగం చేయాలన్నారు. కీవ్‌పై 27వ రోజు కూడా క్రెమ్లిన్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కీవ్ ఇండిపెండెంట్ పేర్కొంది. రష్యాకు భయపడుతున్నారో లేదో తేల్చిచెబితే తాము సైతం ఓకే చెబుతామని, నాటోలో సభ్యత్వం లేకున్నా తమకు సభ్యదేశాలు సెక్యూరీటీ గ్యారెంటీ కల్పించాలని జెలెన్‌స్కీ కోరారు.
నాటోలో చేరాలని ఉక్రెయిన్ తహతహలాడటమే ఆ దేశంపై గత నెలలో మిలటరీ ఆపరేషన్ జరపాలని పుతిన్ ఆదేశాలివ్వడానికి ఒక ప్రధాన కారణం. దీనిపై జెలెన్‌స్కీ గత నెలలో ఒక మెట్టుదిగి నాటోలో సభ్యత్వం కోసం తాము పట్టుపట్టేది లేదన్నారు. ''ఉక్రెయిన్‌ను అంగీకరించేందుకు నాటో సిద్ధంగా లేదనే విషయం చాలా కాలం క్రితమే అర్ధం చేసుకుని ఆ విషయం పక్కనపెట్టేశాం. వివాదాస్పద అంశాలు, రష్యాతో ఘర్షణలకు కూటమి (నాటో) భయపడుతోంది'' అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.
కాగా, మాస్కో-కీవ్ యుద్ధంపై కొనసాగుతున్న శాంతి చర్చల్లో ఇంతవరకూ ఎలాంటి కీలకమైన పురోగతి లేనందున పుతిన్, జెలెన్‌స్కీ మధ్య చర్చలు ఉంటాయా అనేది ఇప్పుడే చెప్పడం కుదరదని రష్యా పేర్కొంది. యుద్ధం నిలిపేసే అవకాశాలపై ఉక్రెయిన్, రష్యా మధ్య ఫిబ్రవరి 28 నుంచి ప్రతినిధుల స్థాయిలో మూడుసార్లు బెలారస్‌లో చర్చలు జరిగాయి. మార్చి 14న ఉభయ పక్షాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాలుగో రౌండ్ చర్చలు జరిపాయి. రాబోయే రోజుల్లో పుతిన్‌తో జెలెన్‌స్కీ సంభాషణలు జరిపే అవకాశాలున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ గత వారం తెలిపారు.