ముర్ముకే మకుటం

ABN , First Publish Date - 2022-07-22T08:30:47+05:30 IST

ముర్ముకే మకుటం

ముర్ముకే మకుటం

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ఘన విజయం

6,76,803 ముర్ముకు పోలైన ఓట్ల విలువ

3,80,177సిన్హాకు పడిన ఓట్ల విలువ

ఓటమిని అంగీకరించిన విపక్ష అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా

3వ రౌండ్‌లోనే ముర్ము గెలుపు ఖరారు.. 64ు ఓట్లు

ఆరు రాష్ట్రాల్లో భారీగా గిరిజన నేతల క్రాస్‌ ఓటింగ్‌

ఏపీలో ఎన్డీయే అభ్యర్థికి 100 శాతం ఓట్లు

మరే పెద్ద రాష్ట్రంలోనూ బీజేపీకి దక్కని భాగ్యం

తెలంగాణలోనే ముర్ముకు అతితక్కువ ఓట్లు

ఇంటికి వెళ్లి ముర్మును అభినందించిన ప్రధాని మోదీ


ప్రజాస్వామ్యానికి శుభసూచకం

గిరిజన సమాజానికి చెందిన బిడ్డ.. అత్యున్నత పదవికి ఎన్నికై చరిత్ర సృష్టించారు. ద్రౌపది ముర్ము గెలుపు ప్రజాస్వామ్యానికి శుభసూచకం. ఆమె అత్యుత్తమ రాష్ట్రపతిగా చరిత్రలో నిలుస్తారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ.. పౌరులకు ముఖ్యంగా పేదలు, అట్టడుగు, అణగారిన వర్గాలకు ఆశాకిరణంగా ఆమె ఉద్భవించారు. ద్రౌపది ముర్ము జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సమాజానికి చేసిన గొప్ప సేవ, ఆదర్శప్రాయమైన జీవన ప్రయాణం ప్రతి భారతీయుడినీ ప్రేరేపిస్తాయి.

- ప్రధాని నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఊహించినట్లుగానే జరిగింది. 15వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. గురువారం పది గంటల పాటు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె 64 శాతం ఓట్లు సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలకో్ట్రరల్‌ కాలేజీలో ఆమెకు 6,76,803 ఓట్లు దక్కగా, ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 ఓట్లు లభించాయి. రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ అధికారికంగా ద్రౌపది ముర్మును విజేతగా ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అధిరోహించిన వారిలో ముర్ముయే అత్యంత పిన్న వయస్కురాలు. ఆమెకు ముందున్న రాష్ట్రపతులంతా స్వాతంత్య్రం రాకముందు జన్మించిన వారు కాగా ఆమె స్వాతంత్ర్యానంతర తరానికి చెందిన వారు. నరేంద్ర మోదీ కూడా స్వాతంత్ర్యానంతరం జన్మించిన తొలి ప్రధా ని. రాష్ట్రపతి పదవికి ముర్ము ఎన్నిక తరం మార్పునకు సంకేతం. మూడో రౌండ్‌లోనే ముర్ముకు చెల్లిన ఓట్లలో 53ు రావడంతో ఆమె విజయం ఖాయమైంది. అప్పటికి ఇంకా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్‌ ఫలితాలు రాగానే యశ్వంత్‌ సిన్హా తన ఓటమిని అంగీకరించి, కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. భయం, పక్షపాతం లేకుండా ఆమె రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తారని ప్రతి ఒక్క రూ ఆశిస్తున్నారన్నారు. తనను విపక్ష అభ్యర్థిగా ఏకాభిప్రాయంతో నిలబెట్టి, ఓట్లేసిన పార్టీలకు ప్రజాప్రతినిధులకు సిన్హా కృతజ్ఞతలు తెలిపారు. గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా కర్మయోగ సిద్ధాంతాన్ని అనుసరించి, విపక్షాల అభ్యర్థి ఆఫర్‌ను స్వీకరించానన్నారు. దేశంపై ప్రేమతో మనస్సాక్షిని అనుసరించి బాధ్యతను నెరవేర్చానన్నారు. 


క్రాస్‌ ఓటింగ్‌

సిన్హాకు మద్దతు ప్రకటించిన పార్టీల ఓట్లు కొన్ని ముర్ముకు పడినట్లుగా తెలుస్తోంది. 17 మంది ఎంపీలు, 102 మంది ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు చెబుతున్నారు. అసోం, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి గిరిజన ప్రజాప్రతినిధులు క్రాస్‌ ఓటింగ్‌కు  పాల్పడినట్లు సమాచారం. ముర్ముకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన జేఎంఎం ఇతర ఎన్డీయేతర పార్టీల ఓట్లు వీటికి అదనం. అయితే, పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి సొంత రాష్ట్రాల్లో కూడా దక్కనన్ని ఓట్లు అసలు ప్రాతినిధ్యమే లేని ఆంధ్రప్రదేశ్‌లో దక్కాయి. ఇక్కడ వంద శాతం మంది ప్రజాప్రతినిధులు ముర్ముకే ఓటేశారు. చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్‌, సిక్కింలలో మాత్రమే బీజేపీ ఇలా వంద శాతం ఓట్లు దక్కించుకుంది. తెలంగాణ, కేరళ, పంజాబ్‌, ఢిల్లీల్లో ప్రధాన పార్టీలు రెండూ ముర్ముకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఆ రాష్ట్రాల్లో ఎన్డీయేకు అతి తక్కువ ఓట్లు దక్కాయి. ముర్ము తిరుగులేని విజయంతో కంగుతిన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దాంతో ఉప రాష్ట్రపతిగా బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ విజయం నల్లేరుపై నడకగా మారింది. మూడో రౌండ్‌లో విజయం ఖాయం కాగానే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘130 కోట్ల మంది భారతీయులు ఆజాదీగా అమృతోత్సవ్‌ జరుపుకుంటున్న తరుణంలో భారతదేశం చరిత్ర సృషించింది. తూర్పు భారతంలోని మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా ఎన్నుకుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. పార్టీలకు అతీతంగా ముర్ముకు మద్దతు తెలిపి రికార్డు స్థాయి విజయానికి దోహదం చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్‌ గవర్నర్‌గా ఆమె పదవీకాలం అద్భుతంగా సాగిందన్నారు. రాష్ట్రపతిగా కూడా ఆమె అద్భుతంగా పని చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని గిరిజన తెగలన్నింటిలో అతిపెద్దదైన సంథాల్‌ తెగలో జన్మించడం ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి పదవిని తెచ్చిపెడితే ఆమె విజయం వచ్చే రెండేళ్ల వ్యవధిలో జరిగే గుజరాత్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో తమకు ఉపకరిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా మోదీ ఎన్డీయే, యూపీఏ కూటములకు దూరంగా ఉన్న బీజేడీ, వైసీపీ, అన్నాడీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్‌, అకాలీదళ్‌ మద్దతును కూడగట్టగలిగారు. చివరకు యూపీఏ కూటమిలో ఉన్న జేఎంఎం కూడా ముర్ముకే మద్దతు పలికింది. ఆంధ్రప్రదేశ్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ ముర్ముని రాష్ట్రపతిని చేయడం ద్వారా ఏపీ గిరిజన ప్రాంతాల్లో పాగా వేయవచ్చని ఆశిస్తోంది. 

Updated Date - 2022-07-22T08:30:47+05:30 IST