Rahul Gandhi: పోలీస్ డిటెన్షన్ క్యాంప్‌లోనే కాంగ్రెస్ నేతలతో మేధోమథనం

ABN , First Publish Date - 2022-07-26T22:16:32+05:30 IST

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరైన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి.

Rahul Gandhi: పోలీస్ డిటెన్షన్ క్యాంప్‌లోనే కాంగ్రెస్ నేతలతో మేధోమథనం

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ (National Herald case) పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) ముందు రెండోసారి హాజరైన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సహా అన్ని సంస్థలనూ దుర్వినియోగం చేస్తోందని, కేంద్రానిది నిరంకుశ వైఖరని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తోన్న కాంగ్రెస్ నేతలందరినీ ఢిల్లీ పోలీసులు కింగ్స్‌వే పోలీస్ డిటెన్షన్ క్యాంపునకు తరలించారు. దీంతో రాహుల్‌ కాంగ్రెస్ నేతలతో అక్కడే మేధోమథనం నిర్వహించారు. ధరల పెరుగుదల, అగ్నిపథ్, ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధింపు, జాతీయ భద్రత, రూపాయి పతనం తదితర అంశాలపై అక్కడ చర్చించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌధరి, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర నేతలంతా ఈ మేధోమథనం (brainstorming session) లో పాల్గొన్నారు.    





వాస్తవానికి కరోనా అనంతర ఇబ్బందులతో బాధపడుతున్న సోనియాను 4 రోజుల క్రితం రెండు గంటలు మాత్రమే ప్రశ్నించారు. వాంగ్మూలం నమోదు చేసుకుని పంపేశారు. ఈడీ సమన్లతో ఆమె మళ్లీ ఈ రోజు హాజరయ్యారు. సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. తొలి సారి విచారణ సమయంలోనూ ప్రియాంకా వాద్రా (Priyanka Gandhi Vadra) సోనియా వెంటే ఉన్నారు. అయితే ప్రశ్నించే గదిలోకి మాత్రం ప్రియాంకను ఈడీ అధికారులు అనుమతించలేదు. ఇదే కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని కూడా గత నెల 13, 14, 15, 20, 21 తేదీల్లో.. ఐదు రోజులపాటు మొత్తం 53 గంటలు విచారించారు. తమ నాయకురాలిని, నాయకుడిని ఈడీ విచారణకు పిలవడంపై కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ‘సత్యాగ్రహ’ నిరసనలు చేపట్టారు.  






నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక వ్యవహారం ఇదే!


ఏఐసీసీ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ప్రస్తుత ‘యంగ్‌ ఇండియన్‌’ ప్రైవేటు లిమిటెడ్‌ అధీనంలో ఉంది. దానిని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌). యంగ్‌ ఇండియన్‌ కంపెనీకి రాహుల్‌, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో చెరి 38శాతం వాటా వారికి ఉంది. ఈ కంపెనీ కేవలం రూ.50లక్షలే చెల్లించి.. ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి 2013లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సోనియా, రాహుల్‌ తదితరులు మోసంతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ఏడాది ఈడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. దీనిపై సమాధానమివ్వాలని సోనియా, రాహుల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది కూడా. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, పవన్‌ బన్సల్‌ను ఇప్పటికే ఈడీ విచారించింది. ఎలాంటి అవకతవకలూ లేవని.. యంగ్‌ ఇండియన్‌ కంపెనీ లాభదాయక సంస్థ కాదని కాంగ్రెస్‌ అంటోంది. ఏజేఎల్‌కు రూ.800 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. యంగ్‌ ఇండియన్‌ లాభదాయక సంస్థ కాకపోతే దాని భూములు, భవనాలను అద్దెకు ఇవ్వడం వంటి వాణిజ్య కార్యకలాపాలు ఎలా చేపడుతోందని ఈడీ ప్రశ్నిస్తోంది. 

Updated Date - 2022-07-26T22:16:32+05:30 IST