వేలానికి ముస్లిం మహిళల ఫొటోలు
ABN , First Publish Date - 2022-01-03T07:16:06+05:30 IST
సోషల్ మీడియా వేదికగా మతితప్పిన దుండగులు వికృత చేష్టలతో ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాల్లోంచి ఫొటోలను సేకరించి, ఓ యాప్‌లో వేలానికి పెట్టారు.....
‘బుల్లీబాయ్’ యాప్‌లో వికృత చర్యలు.. ఆర్నెల్ల క్రితం ‘సలీ డీల్స్’ పేరుతోనూ హల్‌చల్
తప్పుబట్టిన శివసేన ఎంపీ ప్రియాంక
కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు ట్యాగ్
వెంటనే చర్యలు ప్రారంభించిన కేంద్రం
మైక్రోసాఫ్ట్‌కు చెందిన గిట్‌హబ్‌లో హోస్టింగ్
యూజర్‌ను బ్లాక్ చేసినట్లు గిట్‌హబ్ వెల్లడి
మండిపడ్డ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
న్యూఢిల్లీ, జనవరి 2: సోషల్ మీడియా వేదికగా మతితప్పిన దుండగులు వికృత చేష్టలతో ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాల్లోంచి ఫొటోలను సేకరించి, ఓ యాప్‌లో వేలానికి పెట్టారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ గిట్‌హబ్.. నెటిజన్లకు బ్లాగింగ్ అవకాశం కల్పిస్తోంది. గూగుల్ బ్లాగ్‌స్పాట్, వర్డ్‌ప్రెస్‌మాదిరిగానే యూజర్లు రిజిస్టర్ చేసుకుని, బ్లాగింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు.
గిట్‌హబ్‌లో బ్లాగింగ్‌తోపాటు.. యాప్ నిర్వహణకు అవకాశం ఉంటుంది. ఓ ఆగంతుకుడు ‘బుల్లీబాయ్’ పేరుతో రూపొందించిన బ్లాగ్/యా్‌పలో ముస్లిం మహిళల ఫొటోలను విక్రయానికి పెట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో ఫొటోలు ఆ యాప్‌లో ఉన్నాయి. ‘బుల్లీబాయ్ ఆఫ్ ది డే’ పేరుతో రోజుకు ఒక ముస్లిం మహిళ ఫొటోను వేలం జాబితాలో ప్రముఖంగా పెట్టాడు. సామాజిక మాధ్యమాల్లో ఉండే ముస్లిం మహిళల ప్రొఫైల్స్ నుంచి తీసుకున్న ఫొటోలను ఈ యాప్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వేలం ఎలా జరిగేది? నాన్-ఫంగిబుల్ టోకెన్(ఎన్‌ఎ్‌ఫటీ) ద్వారానా? లేక ఏదైనా ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ద్వారానా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ అరాచకాన్ని గుర్తించిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది శనివారం సాయంత్రం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని ట్విటర్‌లో పేర్కొంటూ.. కేంద్ర ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు ట్యాగ్ చేశారు. అదే సమయంలో.. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు కూడా తన ఫొటోను బుల్లీబాయ్ యాప్‌లో అమ్మకానికి పెట్టారంటూ ఫిర్యాదు చేశారు. ఈమె ఫిర్యాదుపై ఐపీసీలోని సెక్షన్లు 509(మహిళలను మాటలు, చేతలతో కించపరచడం, అవమానించడం), 354-ఏ(లైంగిక వేధింపులు), ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముంబై సైబర్‌క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్లు ఆదివారం ప్రకటించారు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు కూడా ఈ అంశంపై సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అటు ఈ యాప్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ(సెర్ట్-ఇండియా)ను ఆదేశించారు. సెర్ట్ ఇండియా వెంటనే యాప్ హోస్టింగ్ సంస్థ గిట్‌హబ్‌ను సంప్రదించి.. ఆ యూజర్‌ను బ్లాక్ చేయించింది. ఈ విషయాన్ని అశ్వినీవైష్ణవ్ ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. దానికి ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. ‘‘అంతటితో సరిపోదు. నిందితులను గుర్తించి, కఠినచర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. ముంబై పోలీసులు నిందితులను గుర్తిస్తారంటూ మరో ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటారు. వారు చర్యలు తీసుకుంటారని అనుకోవడం లేదు’’ అని ఆమె ట్వీట్ చేశారు.
సలీడీల్స్‌కు క్లోనింగే బుల్లీబాయ్?
బుల్లీబాయ్ తరహాలోనే ‘సలీ డీల్స్’ పేరుతో ఆర్నెల్ల క్రితం గిట్‌హబ్‌లోనే ఓ బ్లాగ్/యాప్ ఇలాంటి చర్యలకే ఒడిగట్టింది. అప్పట్లో ఢిల్లీ, యూపీల్లో రెండు కేసులు నమోదయ్యాయి. సలీడీల్స్‌కు క్లోనింగ్ యాపే బుల్లీబాయ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. అప్పట్లో కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి రాలేదని, దాంతో హోస్టింగ్ సంస్థకు జవాబుదారీ ఉండేది కాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త ఐటీ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో.. బుల్లీయాప్ హోస్టింగ్ సంస్థ అయిన గిట్‌హబ్ దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిందేనని, సదరు యూజర్ వివరాలు, హోస్ట్ చేసిన ఐపీ అడ్ర్‌సలను అందజేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ సారి నిందితులు తప్పించుకునే అవకాశం లేదంటున్నారు.