Nupur Sharma Comments: అమరావతి కెమిస్ట్‌ను హత్య చేసింది స్నేహితుడేనట!
ABN , First Publish Date - 2022-07-03T21:24:58+05:30 IST
అమరావతికి చెందిన కెమిస్ట్ ఉమేష్ కొల్హే (54) హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

ముంబై: మహారాష్ట్రలోని అమరావతికి చెందిన కెమిస్ట్ ఉమేష్ కొల్హే (54) హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మహ్మద్ ప్రవక్త(Prophet Muhammad)పై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ (Nupur Sharma) కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే ఆయన హత్యకు కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి.
జూన్ 21న ఉమేష్ (Umesh Kolhe) తన షాపు నుంచి వస్తుండగా కొందరు దుండగులు ఆయనను అడ్డగించి గొంతు కోసి చంపేశారు. వ్యక్తిగత గొడవలు, దొంగతనం వంటివి ఈ హత్యకు కారణమని పోలీసులు తొలుత భావించినా అందుకు సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదు. అయితే, ఉదయ్‌పూర్‌లో హత్యకు గురైన దర్జీ కన్నయ్యలాల్ లానే ఉమేష్ కూడా నుపుర్ శర్మకు మద్దతు పలికారని, ఆయన హత్యకు అదే కారణమని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా, ఈ కేసుకు సంబంధించి మరో షాకింగ్ విషయాన్ని ఉమేష్ సోదరుడు మహేష్ కొల్హే (Mahesh Kolhe) వెల్లడించారు. తన సోదరుడిని హత్య చేసింది ఆయన స్నేహితుడేనని పేర్కొన్నారు. నిందితుడు యూసుఫ్ ఖాన్‌తో తన సోదరుడికి మంచి స్నేహం ఉందని పేర్కొన్నారు. పశువైద్యుడైన యూసుఫ్ ఖాన్ (Yusuf Khan) తమకు 2006 నుంచి తెలుసని అన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు నిందితుల్లో ఖాన్ ఒకడు.