శ్రీరామ నవమి జరపాలని కాంగ్రెస్ లేఖ... అది లౌకికవాదానికి వ్యతిరేకమన్న ఎమ్మెల్యే మసూద్...
ABN , First Publish Date - 2022-04-08T18:41:59+05:30 IST
శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రజల

భోపాల్ : శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రజల మధ్య నిర్వహించాలని జిల్లా శాఖలకు, ఎమ్మెల్యేలకు మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల లేఖలు రాసింది. దీనిపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరిఫ్ మసూద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పండుగలను నిర్వహించడం లౌకికవాదానికి విరుద్ధమని చెప్పారు.
కాంగ్రెస్ ఇటీవల మెతక హిందుత్వాన్ని అనుసరిస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. ఎన్నికల సమయంలో దేవాలయాల్లో పూజలు చేయడం, గోశాలలను సందర్శించడం వంటి కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొంటున్నారని, తాము హిందూ ఆచారాలను పాటిస్తామని బహిరంగంగా చెప్పుకుంటున్నారని అంటున్నారు.
మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జి చంద్ర ప్రభాస్ శేఖర్ ఆ పార్టీ నేతలకు ఇటీవల ఓ లేఖ రాశారు. శ్రీరామ నవమి ఉత్సవాలను నిర్వహించాలని, ఈ సందర్భంగా శ్రీరాముని కథలను, రామ్ లీలాలను నిర్వహించాలని తెలిపారు. హనుమాన్ జయంతిని నిర్వహించాలని, ఆ రోజున సుందరకాండ, హనుమాన్ చాలీసాలను పారాయణ చేయించాలని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ కూడా చింద్వారాలో ఏప్రిల్ 16న హనుమాన్ జయంతిని నిర్వహిస్తారని తెలిపారు.
దీనిపై భోపాల్ సెంట్రల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరిఫ్ మసూద్ స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ అని, ఇది ఏ మతంతోనూ అనుబంధం ఉన్నట్లుగా గుర్తింపు పొందకూడదని చెప్పారు. ఏప్రిల్ నెలలో మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా జరుగుతాయని, రంజాన్ నెల జరుగుతోందని, వీటి గురించి ఈ లేఖలో రాయలేదని, అందుకే తాను అభ్యంతరం తెలిపానని చెప్పారు. అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మాట్లాడుతూ, కాంగ్రెస్ అన్ని పండుగలను జరుపుకుంటోందన్నారు. తమ పార్టీ నేతలు రోజా ఇఫ్తార్లు, గుర్పూరబ్, క్రిస్టమస్ సెలబ్రేషన్స్‌కు హాజరవుతున్నారని చెప్పారు.