మోదీ ‘మోర్బీ టూర్’ ఖర్చు రూ.30 కోట్లు?
ABN , First Publish Date - 2022-12-07T04:19:24+05:30 IST
‘మోర్బీలో బ్రిడ్జి కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ సందర్శించేందుకు అయిన ఖర్చు రూ.30 కోట్లు. అంటే.. ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 135 ..
గుజరాత్ సమాచార్ క్లిప్పింగ్‌తో టీఎంసీ నేత ట్వీట్.. అరెస్ట్
అహ్మదాబాద్, డిసెంబరు 6: ‘మోర్బీలో బ్రిడ్జి కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ సందర్శించేందుకు అయిన ఖర్చు రూ.30 కోట్లు. అంటే.. ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 135 మందిపైగా అమాయకుల కుటుంబాలకు ఇచ్చిన పరిహారం మొత్తం కంటే.. కొద్ది గంటల పాటు సాగిన మోదీ ఈవెంట్ మేనేజ్‌మెంట్, ప్రచార హడావుడికి అయిన వ్యయం ఎక్కువ. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయం తేలింది’’ అంటూ ట్వీట్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలేను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని జైపూర్‌లో పట్టుకుని గుజరాత్ తీసుకొచ్చారు. కాగా, మోదీ మోర్బీ పర్యటన ఖర్చు ఇది అంటూ గుజరాతీ సమాచార్ పత్రిక కథనం క్లిప్పింగ్‌ను జత చేస్తూ గోఖలే ఇటీవల ట్వీట్ చేశారు. అయితే, తాము సంబంధిత ప్రతిక వర్గాలను సంప్రదించామని, అలాంటి కథనమేదీ ఇవ్వలేదని వారు తెలిపినట్లు పోలీసులు వివరించారు. దీంతోనే గోఖలేను అరెస్టు చేసినట్లు చెప్పారు.