Chief Minister: ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఈ-సేవా కేంద్రాలు
ABN , First Publish Date - 2022-10-21T14:22:05+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యుల కార్యాలయాల్లో ఏర్పాటైన ఈ-సేవా కేంద్రాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రారంభించారు.
- ప్రారంభించిన సీఎం స్టాలిన్
చెన్నై, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యుల కార్యాలయాల్లో ఏర్పాటైన ఈ-సేవా కేంద్రాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రారంభించారు. సచివాలయంలో గురువారం ఉదయం శాసనసభ స్పీకర్ అప్పావు సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తొమ్మిదిమంది శాసనసభ్యులకు ఈ-సేవా కేంద్రాలకు అవసరమైన డెస్క్‌టాప్‌లు, ఇతర పరికరాలను సీఎం అందజేశారు. మొదట కొళత్తూరు శాసనసభ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఈ -సేవా కేంద్రాలకు అవసరమైన కంప్యూటర్లు, పరికరాలను సమాచార సాంకేతిక శాఖ మంత్రి మనో తంగరాజ్ అందజేశారు. రాష్ట్రంలోని 234 శాసనసభ నియోజవర్గాల్లో ఈ సేవా కేంద్రాలు వీలైనంత త్వరగా సేవలను అందిస్తాయని స్టాలిన్(Stalin) ప్రకటించారు. ఈ సందర్బంగా డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ప్రభుత్వ విఫ్ కోవి చెళియన్, శాసనసభ్యులు సెల్వపెరుంతగై, జీకే మణి, ఎం. చిందనై సెల్వన్, డాక్టర్ టి. సతన్, తిరుమలైకుమార్, ఎంహెచ్ జవాహిరుల్లా, ఈఆర్ ఈశ్వరన్, వేల్‌మురుగన్ ఈ సేవా కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కంప్యూటర్లు, పరికరాలు స్వీకరించారు.ఈకార్యక్రమంలో మంత్రు లు పళనివేల్ త్యాగరాజన్, మనో తంగరాజ్, సమాచార డిజిటల్ సేవల శాఖ ముఖ్య కార్యదర్శి నీరజ్ మిట్టల్, శాసనసభ కార్యదర్శి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త భవనాల ప్రారంభం... : సచివాలయంలో జరిగిన మరొక కార్యక్రమంలో చెంగల్పట్టు, తిరువళ్లూరు, నాగపట్టినం, రామనాథపురం, కృష్ణగిరి జిల్లాల్లో పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రూ.31.67 కోట్లతో నిర్మించిన భవనాలను స్టాలిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనితారాధాకృష్ణన్, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు.