‘ప్రజల్లో తాంబూలం వేసుకొనే అలవాటు తగ్గింది’

ABN , First Publish Date - 2022-04-23T17:56:20+05:30 IST

రాష్ట్రప్రజల్లో తాంబూలం వేసుకొనే అలవాటు సన్నగిల్లిందని, ఫ్యాషన్‌కు అలవాటుపడిన యువత బీడా నమలడానికే ఇష్టపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం

‘ప్రజల్లో తాంబూలం వేసుకొనే అలవాటు తగ్గింది’

                          - మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రప్రజల్లో తాంబూలం వేసుకొనే అలవాటు సన్నగిల్లిందని, ఫ్యాషన్‌కు అలవాటుపడిన యువత బీడా నమలడానికే ఇష్టపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం అసెంబ్లీలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పెరియకుళం ఎమ్మెల్యే శరవణన్‌, తేని జిల్లాలో రైతులు సాగుచేసే తమలపాకుల్లో ఔషధగుణాలు మెండుగా ఉన్నాయని, ఇందు వల్ల పెరియకుళం నియోజకవర్గంలో తమలపాకుల పరిశోధన కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. అదే విధంగా డీపీఐ ఎమ్మెల్యే సింథనైసెల్వం కూడా కాట్టుమన్నార్‌కోయిల్‌ నియోజకవర్గంలో తమలపాకుల ఉత్పత్తి అధికంగా ఉందని, అక్కడ కూడా పరిశోధన కేంద్రంతో కూడిన ఉద్యానవన కళాశాల ఏర్పాటుచేయాలని కోరారు. దీనిపై మంత్రి పన్నీర్‌సెల్వం సమాధానం చెబుతూ, తంజావూరు, మదురై, తిరుచ్చి, నాగపట్టణం జిల్లాల్లో పండించే తమలపాకులకు 20 ఏళ్ల క్రితం మంచి డిమాండ్‌ ఉండేదని, భోజనం అనంతరం తాంబూలం వేసుకొనే సంస్కృతి ఈ జిల్లాల్లో ఒకప్పుడు ఉండేదన్నారు. ప్రస్తుతం ఫ్యాషన్‌కు అలవాటుపడిన యువతీ యువకులు తాంబూలం జోలికి వెళ్ల కుండా స్వీట్‌ బీడా అలవాటు చేసుకుంటున్నారని తెలిపారు. తమల పాకులు ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు రైతులకు రాయితీ అందజేస్తున్నామని, ఈ పథకం ద్వారా 778 మంది రైతులు లబ్దిపొందుతున్నారని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-04-23T17:56:20+05:30 IST