అక్కడ కొత్త డ్యామ్‌ నిర్మాణమా?

ABN , First Publish Date - 2022-02-19T13:50:49+05:30 IST

ముల్లై పెరియార్‌ డ్యామ్‌ వద్ద కొత్త ఆనకట్టను నిర్మించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ శాసనసభలో

అక్కడ కొత్త డ్యామ్‌ నిర్మాణమా?

- కేరళ నిర్ణయం సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకం

- మంత్రి దురైమురుగన్‌ ఆగ్రహం


చెన్నై: ముల్లై పెరియార్‌ డ్యామ్‌ వద్ద కొత్త ఆనకట్టను నిర్మించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ శాసనసభలో శుక్రవారం ఉదయం గవర్నర్‌ ప్రసంగిస్తూ ముల్లై పెరియార్‌ వద్ద కొత్త డ్యామ్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నట్లు ప్రసారమాధ్యమాల్లో వచ్చిన వార్తను చూసి తాను దిగ్ర్భాంతి చెందానని ఆయన పేర్కొన్నారు. ముల్లై పెరియార్‌ డ్యామ్‌ నీటిమట్టం పెంచే విషయంపై కొనసాగిన వివాదంపై సుప్రీం కోర్టు 2014 జూన్‌ 7న ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం ఆ ప్రాంతం వద్ద  కొత్త డ్యామ్‌ను ఎలా నిర్మిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు దురైమురుగన్‌ శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన జారీ చేస్తూ.. కేరళ ప్రభుత్వం ముల్లై పెరియార్‌ డ్యామ్‌ వద్ద కొత్త ఆనకట్టను నిర్మిస్తే అది సుప్రీం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనగా భావించాల్సి వస్తుందన్నారు. ముల్లై పెరియార్‌ డ్యామ్‌ చాలా పటిష్ఠంగానే ఉందని  సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఆ ప్రాంతం వద్ద కొత్త డ్యామ్‌ను నిర్మించాల్సిన అవసరమే లేదని, పైగా కొత్త డ్యామ్‌ నిర్మాణ పథకాన్ని చేపట్టమంటూ కేరళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్బంధించే అవకాశాలు కూడా లేవని, ఎందుకంటే ముల్లై పెరియార్‌ డ్యామ్‌ రాష్ట్ర పరిధిలోనే ఉందన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా కేరళ ప్రభుత్వం ఏకపక్షంగా ఆ ప్రాంతంలో కొత్త డ్యామ్‌ను నిర్మించనున్నట్లు గవర్నర్‌ ప్రసంగంలో ప్రకటించడం గర్హనీయమని దురైమురుగన్‌ పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ముల్లై పెరియార్‌ డ్యామ్‌ ప్రాంతంపై రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడుకుంటామని ఆయన వివరించారు.


అన్బుమణి రాందాస్‌ ఖండన

ఇదిలా ఉండగా ముల్లై పెరియార్‌ డ్యామ్‌ వద్ద కొత్త ఆనకట్టను నిర్మించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేస్తూ కేరళ ప్రభుత్వం కొత్త ఆనకట్ట నిర్మించే విషయమై తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ప్రకటించడం కూడా గర్హనీయమన్నారు. ముల్లై పెరియార్‌ డ్యామ్‌ పటిష్ఠంగా ఉందని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ డ్యామ్‌ బలహీనంగా ఉందనే విధంగా కొత్త డ్యామ్‌ను నిర్మించాలనుకోవడం భావ్యం కాదని అన్నారు. కొత్త ఆనకట్ట నిర్మించే విషయమై కేరళ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులెవరూ వెళ్ళకూడదని అన్బుమణి రాందాస్‌ విజ్ఞప్తి చేశారు.

Read more