మందులు మరింత ప్రియం!

ABN , First Publish Date - 2022-03-04T07:57:09+05:30 IST

ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలో మందుల ధరలు కూడా మరింత ప్రియంకానున్నాయి....

మందులు మరింత ప్రియం!

 800 ఔషధాలు, మెడికల్‌ డివైజ్‌ల ధరలు 10 శాతానికి 

పైగా పెరిగే చాన్స్‌.. టోకు ధరల సూచీ పెరుగుదలే కారణం


న్యూఢిల్లీ, మార్చి 3: ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలో మందుల ధరలు కూడా మరింత ప్రియంకానున్నాయి. సాధారణంగా వచ్చే వ్యాధుల చికిత్స కోసం ఉపయోగించే ఔషధాల ధరలు ఈ ఏడాదిలో బాగా పెరిగే సంకేతాలు వెలువడుతున్నాయి. జాతీయ అత్యవసర ఔషధాల జాబితా (ఎన్‌ఎల్‌ఈఎం)లోని ఔషధాలు, మెడికల్‌ డివైజ్‌ల ధరలు ఏటా సగటున 2-3 శాతం పెరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం ధరల పెరుగుదల ఎక్కువగా ఉండవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. సాధారణ యాంటీబయాటిక్స్‌తోపాటు జ్వరం, రక్తపోటు చికిత్సకు వాడే మందులు ధరలు బాగా పెరిగే అవకాశం ఉన్నవాటిలో ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్‌ఎల్‌ఈఎంలోని దాదాపు 800 మందులు, వైద్య పరికరాల ధరలు 10 శాతానికి పైగా పెరగనున్నాయని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.


టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)లో పెరుగుదల ఇందుకు కారణమని చెబుతున్నారు. డబ్ల్యూపీఐ ఆధారంగా ఎన్‌ఎల్‌ఈఎం జాబితాలోని ఔషధాల ధరల్లో వార్షిక పెరుగుదల ఉంటుంది. గత జనవరిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 12.96 శాతానికి పెరిగింది. 2021 జనవరిలో ఇది 2.51 శాతం ఉండగా.. అదే సంవత్సరం ఏప్రిల్‌ నుంచి రెండంకెల స్థాయిలో ఉంది. షెడ్యూల్డ్‌ ఔషధాల ధరలను సవరించడానికి డబ్ల్యూపీఐని ఆధారంగా చేసుకుంటున్నందున ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరల్లో పెరుగుదల కనిపించనుందని జాతీయ ఔషధ ధరల నిర్ణయ ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. డబ్ల్యూపీఐ దృష్ట్యా ఈ ఏడాది ఎన్‌ఈఎల్‌ఎం ఫార్ములేషన్ల ధరలను 10 శాతానికి పైగా పెంచేందుకు అనుమతించే అవకాశం ఉందన్నారు. ఎన్‌ఈఎల్‌ఎం జాబితాలో జ్వరం, ఇన్ఫెక్షన్‌, గుండెజబ్బులు, రక్తపోటు, చర్మ వ్యాధులు, రక్తహీనత తదితర వ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాలుంటాయి. కాగా దేశీయ మార్కెట్లో ఉన్న దాదాపు 6,000 ఫార్ములేషన్లలో 17-18 శాతం షెడ్యూల్డ్‌ ఔషధాలున్నాయి. వీటి ధరలు నియంత్రణ పరిధిలో ఉండగా.. వీటికి గరిష్ఠ రిటైల్‌ ధరను ఎన్‌పీపీఏ నిర్ణయిస్తుంది. 

 

Updated Date - 2022-03-04T07:57:09+05:30 IST