ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఎంఈఏ సలహా

ABN , First Publish Date - 2022-03-05T21:40:19+05:30 IST

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఎంఈఏ సలహా

న్యూఢిల్లీ : యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తాజాగా ఓ సలహా ఇచ్చింది. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, సురక్షితంగా ఉండటానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖ, ఎంబసీలు విద్యార్థులతో సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పింది. ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శనివారం ఓ ట్వీట్‌లో ఈ వివరాలను వెల్లడించారు. 


ఉక్రెయిన్‌లోని సుమీలో భారతీయ విద్యార్థుల గురించి తీవ్ర ఆందోళనతో ఉన్నామని అరిందమ్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాలకు అనేక వర్గాల ద్వారా పరిస్థితిని వివరించామని, భారతీయ విద్యార్థులు సురక్షితంగా బయటపడటానికి వీలుగా తక్షణమే కాల్పులను విరమించాలని నొక్కి చెప్పామని తెలిపారు. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, సురక్షితంగా ఉండటానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు తెలిపామని చెప్పారు. ఈ మంత్రిత్వ శాఖ, ఎంబసీలు విద్యార్థులతో సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. 


ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ట్వీట్‌లో, సుమీ నగరం నుంచి వందలాది మంది విదేశీ విద్యార్థులను తరలించేందుకు తాము చేయగలిగినదంతా చేస్తున్నామని తెలిపింది. 


బాల్టిక్ సముద్ర దేశాల మండలి నుంచి రష్యా, బెలారస్‌లను యూరోపియన్ యూనియన్ బహిష్కరించింది. ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ అత్యంత భారీ పేలుళ్ళతో దద్దరిల్లింది. కీవ్ నగరానికి సమీపంలోని మర్కలెవ్కా గ్రామంపై జరిగిన వైమానిక దాడిలో ఓ చిన్నారి సహా ఆరుగురు మరణించారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లోని మరియుపోల్, వోల్నోవఖా నగరాల్లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాల్పులకు విరామం ఇస్తామని రష్యా ప్రకటించింది. 


 

Updated Date - 2022-03-05T21:40:19+05:30 IST