అఫ్ఘాన్‌లో భారీ భూకంపం.. వెయ్యి మంది సమాధి
ABN , First Publish Date - 2022-06-23T07:25:46+05:30 IST
తాలిబాన్ల పాలన మొదలయ్యాక.. పేదరికం పెరిగిపోయి.. ఆకలి కేకలు మిన్నంటుతున్న అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది.

మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం!
1500 మందికి పైగా గాయాలు
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1
తక్కువ లోతులో భూకంపంతో తీవ్ర నష్టం
సహాయ చర్యలకు తీవ్ర ఆటంకాలు!
500 కి.మీ వరకు ప్రకంపనలు
పాక్ సరిహద్దుల్లోనూ కూలిన భవనాలు
తాలిబాన్ ప్రధాని అత్యవసర సమావేశం
సాయం కోసం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి
ఆదుకుంటాం: భారత్.. రెడ్‌క్రాస్ వితరణ
కాబూల్, జూన్ 22: తాలిబాన్ల పాలన మొదలయ్యాక.. పేదరికం పెరిగిపోయి.. ఆకలి కేకలు మిన్నంటుతున్న అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అఫ్ఘాన్ తూర్పులోని ఖోస్ట్ ప్రావిన్స్ పరిధిలోని పాక్ సరిహద్దులో ఉన్న పర్వత ప్రాంతం పక్టికా కేంద్రంగా భూమి కంపించడంతో.. మట్టి ఇళ్లు పెళపెళా కూలిపోయాయి. పర్వత ప్రాంతం కావడంతో.. బండరాళ్లు దొర్లిపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో.. వందల మంది నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండడంతో తీవ్రత ఎక్కువగా ఉందని ఐరోపా భూకంపాల అధ్యయన సంస్థ(ఈఎంఎ్‌ససీ) వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత 500 కిలోమీటర్ల దాకా.. అంటే పాకిస్థాన్, భారత్ సరిహద్దుల వరకు ప్రభావం చూపిందని ఆ సంస్థ వివరించింది. మారుమూల ప్రాంతం కావడంతో తాలిబాన్ సర్కారు హెలికాప్టర్ల ద్వారా సహాయక బృందాలను తరలించింది. అప్పటికే సోషల్‌మీడియాలో షేర్ అయిన.. ప్రజల హాహాకారాలు.. బ్లాంకెట్లలో మృతదేహాల తరలింపు.. తమవారిని కోల్పోయినవారి రోదనలు.. సహాయకచర్యల కోసం ఎదురుచూపులు వంటి దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ‘‘ఇప్పటి వరకు 1,000 మందికి పైగా చనిపోయి ఉంటారని అంచనా. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చు. 1,500 మంది వరకు క్షతగాత్రులున్నారు.ఖోస్ట్ ప్రావిన్స్‌లోనూ చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. పక్కా గృహాలు ఉండే చోటే ఇలా ఉంటే.. మారుమూల, పర్వత ప్రాంతాల్లో మట్టిగోడలతో నిర్మించిన ఇళ్ల పరిస్థితి మరింత దారుణం’’ అని అధికారులు వివరించారు. పక్టికాలో భూకంప తీవ్రత అధికంగా ఉందని.. ఇక్కడ మరణాలు ఎక్కువగా సంభవించాయని వెల్లడించారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. సామూహిక ఖననాలు నిర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు.
సహాయకచర్యల్లో జాప్యం!
నిజానికి ఇలాంటి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు.. అంతర్జాతీయ సహాయక బృందాలు ముందుండి తమ సేవలను అందిస్తాయి. అఫ్ఘాన్ తాలిబాన్ల హస్తగతమైన తర్వాత చోటుచేసుకున్న హింస కారణంగా.. పలు స్వచ్ఛంద సంస్థలు, విపత్తు నిర్వహణ విదేశీ బృందాలు దేశాన్ని వీడాయి. రెడ్‌క్రాస్, ఐక్యరాజ్య సమితి(యూఎన్) మినహా.. విపత్తు నిర్వహణ విభాగాలు అఫ్ఘాన్‌లో దాదాపుగా లేవు. దీంతో.. సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.
క్షతగాత్రులకు అక్కడికక్కడే చికిత్సలు
అఫ్ఘాన్ సర్కారు హెలికాప్టర్ల ద్వారా వైద్య, సహాయక బృందాలను ఖోస్ట్ రీజియన్‌లోని పలు ప్రాంతాలకు తరలించింది. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హెలికాప్టర్లలో తరలిస్తున్నారు. వైద్య బృందాలు ఎక్కడికక్కడే క్షతగాత్రులకు చికిత్సలు అందిస్తున్నాయి. ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కించడం.. నేలపైనే చికిత్సలు అందిస్తుండడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విపత్తుపై తాలిబాన్ ప్రధాని మహమ్మద్ హసన్ అఖుంద్ అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక, చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రెడ్‌క్రాస్ సొసైటీ 800 టెంట్లు, 800 వంటసామగ్రి కిట్లు, 4 వేల దుప్పళ్లను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించింది. ఇటలీ వైద్య సహాయ బృందం 7 అంబులెన్స్‌లను, వైద్య సిబ్బందిని ఖోస్ట్‌కు తరలించింది.

అఫ్ఘాన్‌ను ఆదుకుంటాం: భారత్
న్యూఢిల్లీ: విపత్తు సమయంలో అఫ్ఘాన్‌ను అన్నివిధాలా ఆదుకుంటామని భారత్ పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అఫ్ఘాన్‌కు సాయం చేస్తామని ప్రకటించారు. యూఎన్, ఈయూ కూడా సాయం చేయడానికి ముందుకొచ్చాయి.
2 దశాబ్దాల తర్వాత అతిపెద్దది
అఫ్ఘానిస్థాన్ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో భూకంపాలు సాధారణమే. అయితే.. బుధవారం నాటి భూకంపం రెండు దశాబ్దాల తర్వాత ఇదే అతిపెద్దది అని ఈఎంఎ్‌ససీ వెల్లడించింది. 2002లో ఈశాన్యంలో భారీ భూకంపం సంభవించింది. ఆ ఏడాది మార్చి 3న సంభవించిన భూకంపంలో 144.. మార్చి 25న మరో భూకంపంలో 1,400కు పైగా మరణాలు నమోదయ్యాయి. 1998లో తాలిబాన్ల హయాంలో తూర్పు అఫ్ఘాన్‌లో భారీ భూకంపం సంభవించి 4,500 మంది పౌరులు కన్నుమూశారు.
