Nitin Gadkari : నలుగురిని పెళ్లాడటం అసహజం

ABN , First Publish Date - 2022-12-10T01:03:40+05:30 IST

ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని చెబుతూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నలుగురు భార్యలను పెళ్లాడటం అసహజం’’ అని గడ్కరీ అన్నారు.

Nitin Gadkari : నలుగురిని పెళ్లాడటం అసహజం

చదువుకున్న ఏ ముస్లిం కూడా అంగీకరించడు

2 పౌరస్మృతులు ఉన్న ముస్లిందేశం ఏదైనా ఉందా?

ఉమ్మడి పౌరస్మృతి ఏ మతానికీ వ్యతిరేకం కాదు

దేశ క్షేమం,పేదల సంక్షేమం కోసమే కోరుతున్నాం

ఓ చానల్‌ కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, డిసెంబరు 9 : ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని చెబుతూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నలుగురు భార్యలను పెళ్లాడటం అసహజం’’ అని గడ్కరీ అన్నారు. ఓ ప్రైవేటు చానల్‌ నిర్వహించే ‘ఎజెండా ఆజ్‌తక్‌’ అనే కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన ఈ సందర్భంగా రాగా, అది ఏ మతానికి వ్యతిరేకం కాదని, దేశ క్షేమం, పేదల సంక్షేమం మాత్రమే తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ‘‘ రెండు పౌరస్మృతులు అమల్లోఉన్న ముస్లిం దేశం ఏదైనా మీకు తెలుసా? ఒక స్ర్తీని ఒక పురుషుడు పెళ్లాడటం సహజం. అదే నలుగురు భార్యలను ఒక పురుషుడు కలిగి ఉండటాన్ని సహజం అనలేం. ముస్లిం సమాజాల్లో చదువుకున్న, ప్రగతిదాయక ఆలోచనలు కలిగిన పురుషులెవరూ నాలుగుసార్లు వివాహం చేసుకోవాలని అనుకోరు’’ అని గడ్కరీ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని రాజకీయకోణంలో చూడరాదన్నారు. ఎందుకు ఉమ్మడి పౌరస్మృతిని కేంద్రం వెంటనే దేశమంతా అమల్లోకి తీసుకురావడంలేదని ప్రశ్నించగా.. కేంద్ర, రాష్ట్ర సంబంధాల ఉమ్మడిజాబితాలో ఈ అంశాన్ని చేర్చారని, రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానంచేసి పంపితేనే పార్లమెంటులో చట్టం చేయడం సాధ్యమని గడ్కరీ వివరించారు. టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ కోరుకుంటే భారత్‌కు వచ్చి వ్యాపారాలు చేయుచ్చునని ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి అన్నారు. అయితే, చైనాలో ఆయన తయారుచేసే ఉత్పత్తులను అమ్ముకోడానికి భారత్‌లో రాయితీలు కోరడం సరికాదన్నారు. కాగా, ఒకనాటి భారతీయ రహదారుల పరిస్థితిపై గడ్కరీ సరదా వ్యాఖ్యలు చేశారు. జీపులో ఎన్నికల ప్రచారానికి వెళుతూ..వెంట తప్పకుండా అయోడెక్స్‌ (నొప్పుల లేపనం) ఉంచుకునేవాడినని చమత్కరించారు. ఇదిలాఉండగా, ఉమ్మడి పౌరస్మృతి అంశంపై గురువారం అసోం సీఎం బిశ్వశర్మ కూడా గడ్కరీలాగే స్పందించారు.

Updated Date - 2022-12-10T03:52:47+05:30 IST