Vinayak Mete: రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ వినాయక్ మేటే దుర్మరణం
ABN , First Publish Date - 2022-08-14T22:16:27+05:30 IST
శివ్ సంగ్రామ్ పార్టీ నేత, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ వినాయక్ మేటే (Vinayak Mete) ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు

ముంబై: శివ్ సంగ్రామ్ పార్టీ నేత, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ వినాయక్ మేటే (Vinayak Mete) ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. ముంబై-పూణె ఎక్స్ప్రెస్ వేపై ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొనడంతో వినాయక్ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.
రాయసాని పోలీస్ స్టేషన్ పరిధిలో మదప్ టన్నెల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 5.05 గంటలకు ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. కారు పూణె నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, మేటేతోపాటు కారులో ఉన్న మరో వ్యక్తి, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిని వెంటనే నవీ ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మేటే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
మరాఠ్వాడా ప్రాంతంలోని బీడ్ జిల్లాకు చెందిన వినాయక్ మేటే మరాఠా రిజర్వేషన్ల అనుకూలవాది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మేటే మరణంపై పలువురు రాజకీయ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినాయక్ మరణవార్త తనను షాక్కు గురిచేసిందని మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు. ఆయన మరణం మరాఠా సామాజిక వర్గానికి తీరని లోటని అన్నారు. మేటే మరణానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ సంతాపం తెలిపారు.