Mangaluru Blast: ఆ పేలుడు మా పనే.. మరో దాడికి సిద్ధంగా ఉండండి: హెచ్చరించిన ఉగ్రవాద సంస్థ

ABN , First Publish Date - 2022-11-24T16:10:34+05:30 IST

మంగళూరులో ఈ నెల 19న జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమ పనేనని, మరో దాడికి సిద్ధంగా ఉండాలని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్

Mangaluru Blast: ఆ పేలుడు మా పనే.. మరో దాడికి సిద్ధంగా ఉండండి: హెచ్చరించిన ఉగ్రవాద సంస్థ
Mangaluru Blast

బెంగళూరు: మంగళూరులో ఈ నెల 19న జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమ పనేనని, మరో దాడికి సిద్ధంగా ఉండాలని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్ (IRC) గురువారం హెచ్చరించింది. ఈ హెచ్చరికను తీవ్రంగా పరిగణించిన దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్రదాడి మూలాలను పట్టుకునే పనిలో పడ్డాయి. ఆ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి తమ సోదరుడని పేర్కొన్న ఇస్లామిక్ సంస్థ.. నిజానికి తమ టార్గెట్ మంగళూరు నగరం కాద్రిలోని ఓ దేవాలయమని పేర్కొంది.

కాషాయ ఉగ్రవాదులకు మంగళూరు కంచుకోటలా మారిందని ఆరోపించిన ఐఆర్‌సీ.. తమ ఈ ప్రయత్నం విఫలమైనా ఇక్కడితో ఉరుకోబోమని, రాష్ట్ర, కేంద్ర బలగాల కన్నుగప్పి మరో దాడి చేస్తామని, అందుకు సిద్ధమవుతున్నామని పేర్కొంది. కాద్రిలోని హిందూ ఆలయంపై తమ సోదరుడు జరిపిన దాడి విఫలమైందని, తమ సోదరులను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర, కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయని ఐఆర్‌సీ పేర్కొంది. భవిష్యత్తులో మరో దాడి తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.

మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు దాడిని అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు ఐఆర్‌సీ చేసిన ప్రకటనను నిర్ధారించుకునే పనిలో పడ్డాయి. ఈ నెల 19న ఓ ఆటోలో ఈ బాంబు పేలుడు జరిగింది. రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో ఈ కుక్కర్ బాంబును తయారు చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు తొలుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు నిర్వహించే చిల్డ్రన్స్ ఫెస్ట్‌లో బాంబును పేల్చాలని అనుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసును త్వరలోనే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించనున్నట్టు కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర (Araga Jnanendra) తెలిపారు.

Updated Date - 2022-11-24T16:10:36+05:30 IST