TMC leaders arrests : కంగు తిన్న మమత... పార్టీ ప్రక్షాళనకు సన్నాహాలు...
ABN , First Publish Date - 2022-08-13T19:51:50+05:30 IST
పశ్చిమ బెంగాల్ (West Bengal) అధికార పార్టీ టీఎంసీ (TMC) అగ్ర

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ (West Bengal) అధికార పార్టీ టీఎంసీ (TMC) అగ్ర నేతల అరెస్టులతో ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) కంగు తిన్నారు. అవినీతి ఆరోపణలపై పార్థ ఛటర్జీ (Partha Chatterjee), అనుబ్రత మోండల్ (Anubrata Mondal) అరెస్టవడంతో పార్టీకి వచ్చిన కళంకాన్ని తొలగించి, ప్రకాశవంతమైన కీర్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) దాదాపు రెండు వారాల నుంచి జిల్లా స్థాయి నాయకులతో చర్చిస్తున్నారు.
అభిషేక్ బెనర్జీ దాదాపు 15 రోజుల నుంచి ఉత్తర బెంగాల్, పశ్చిమ జిల్లాలకు చెందిన టీఎంసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. త్వరలో దక్షిణ బెంగాల్ టీఎంసీ నేతలతో చర్చలు జరుపుతారు. 2023లో జరిగే పంచాయతీ ఎన్నికల కోసం ప్రతి జిల్లాలోనూ బ్లాకులవారీగా నేతలతో సమావేశాలు ఇప్పటికే పూర్తయినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి జిల్లాలోనూ చేయవలసిన పనులు ఏమిటి? వేటిని చేయకూడదు? అనే అంశాలతో ఓ జాబితాను రూపొందించినట్లు తెలిపాయి.
ఇప్పటికే అవసరమైన జిల్లాల్లో టీఎంసీ జిల్లా అధ్యక్షులను మార్చారని, జిల్లా కార్యవర్గాల్లో భారీ ప్రక్షాళన జరగబోతున్నట్లు తెలిపాయి. నిజాయితీపరులకే జిల్లా కమిటీల్లో పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పాయి. టీఎంసీ కీర్తి, ప్రతిష్ఠలను పునరుద్ధరించేందుకు జిల్లా, యువజన, విద్యార్థి, మహిళ, ట్రేడ్ యూనియన్ విభాగాల్లో నిజాయితీపరులకు, విశ్వసనీయతగలవారికి అవకాశం కల్పించబోతున్నట్లు వివరించాయి.
వర్గ పోరు, లాబీయింగ్ పార్టీకి శాపంగా మారినట్లు అగ్ర నేతలు గుర్తించారని కొందరు టీఎంసీ నేతలు చెప్పారు. జిల్లా అధ్యక్షుడు, ఇతర విభాగాలు సమన్వయంతో పని చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివాసీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వారితో సన్నిహితంగా ఉంటూ, వారికి ప్రాతినిధ్యంవహించేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందని తెలిపారు.
టీఎంసీకి ఈడీ, సీబీఐ ట్రబుల్స్
టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీకి అత్యంత సన్నిహితులైన పార్థ ఛటర్జీ, అనుబ్రత మోండల్‌లను అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి నిజమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలపై ఈ ప్రభావం పడుతోంది.
టీఎంసీ యువజన విభాగం నేత వినయ్ మిశ్రా, ఆయన సోదరుడు వికాస్ మిశ్రాలను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలను కూడా ఈడీ అరెస్టు చేసింది. వీరిద్దరూ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. విద్యా సంస్థల్లో నియామకాల కుంభకోణం కేసులో వీరిద్దరిపైనా సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేస్తోంది. ఆవుల అక్రమ రవాణా కేసులో అనుబ్రత మోండల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అభిషేక్ బెనర్జీ, ఆయన సతీమణి రుజిర బెనర్జీలను ప్రశ్నించేందుకు ఈడీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. విద్యా శాఖ మంత్రి పరేష్ అధికారిని ప్రశ్నించేందుకు కలకత్తా హైకోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఆయన తన కుమార్తె అంకితను ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నియమించినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. టీచర్ల నియామకాల కుంభకోణం కేసులో టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఈడీ ప్రశ్నించింది.