రక్షణరంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం: రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-01-31T18:22:53+05:30 IST

దేశ భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో మేక్ ఇన్ ఇండియాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని..

రక్షణరంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: దేశ భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో మేక్ ఇన్ ఇండియాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. డ్రోన్ కంపెనీలను ప్రోత్సహించేందుకు నిబంధనలను సరళతరం చేసిందని తెలిపారు. దేశంలో వచ్చే పాతికేళ్ల పునాదులు పటిష్టంగా ఉండేదుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి సోమవారం ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఆత్మ నిర్భర్ భారత్ సంక్లపంతో దేశీయ విద్యావిధానంలో తీసుకవచ్చిన మార్పులు, పేద ప్రజలు, రైతులు, మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. టోక్యో ఒలంపిక్స్‌లో  భారత్ యువశక్తి సామర్థ్యాన్ని ప్రశంసించారు. 2014తో పోలిస్తే ఖాదీ అమ్మకాలు మూడింతలు పెరిగాయని అన్నారు.


33 సైనిక స్కూళ్లలో ఆడపిల్లలకు అడ్మిషన్లు

ఆడపిల్లలకు కూడా 33 సైనిక స్కూళ్లలోనూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని చెప్పారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో (ఎన్‌డీఏ) మహిళా క్యాడెట్ల ప్రవేశానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.


ఎఫ్‌డీఐలు పెరిగాయి..

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 48 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని రాష్ట్రపతి తెలిపారు. దేశంలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ఉన్న ధీమాను ఈ విషయం రుజువు చేస్తోందన్నారు. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, ఇందుకోసం ప్రభుత్వం అవిశ్రాతంగా కృషి చేస్తోందని తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం మెగా టెక్స్‌టైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. మొబైల్ ఉత్పత్తుల పరిశ్రమ ఎదుగుదల మేక్ ఇన్ ఇండియా విజయవంతానికి నిదర్శనమని చెప్పారు.

Read more