డిస్కౌంట్‌తో.. పన్నెండు వేలకే మహీంద్రా జీప్

ABN , First Publish Date - 2022-03-06T20:03:38+05:30 IST

ఔను.. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీ జీప్ ధర 12,421 రూపాయలే. అది కూడా రూ.200 తగ్గింపుతో కలిపి ఈ ధర. ఏంటీ.. నమ్మకం కుదరట్లేదా.. కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రకటన చూడండి.

డిస్కౌంట్‌తో.. పన్నెండు వేలకే మహీంద్రా జీప్

ఔను.. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీ జీప్ ధర 12,421 రూపాయలే. అది కూడా రూ.200 తగ్గింపుతో కలిపి ఈ ధర. ఏంటీ.. నమ్మకం కుదరట్లేదా.. కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రకటన చూడండి. నిజమే కదూ. కానీ, అక్కడే ఉంది అసలు విషయం. అది తాజా ప్రకటన కాదు. 1960ల నాటి పత్రికా ప్రకటన. మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ కంపెనీ దశాబ్దాలుగా వాహన రంగంలో ఉందనే సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సంస్థ నుంచి వచ్చిన విల్లీస్ మోడల్ సీజే 3బీ జీప్‌లు బాగా ఫేమస్. 1960లలో వీటి ధర పన్నెండు వేల రూపాయలే ఉండేది. అదే టైమ్‌లో స్పెషల్ డిస్కౌంట్ కింద రూ.200 తగ్గింపు కూడా ఇచ్చారు. ఈ డిస్కౌంట్‌తో అన్ని పన్నులతో కలిపి జీప్ ధర రూ.12,421 (ముంబై షోరూం)గా నిర్ణయించారు. 

ఈ ఆఫర్‌కు సంబంధించి అప్పట్లో పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. మహీంద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ పత్రికా ప్రకటనను ఆదివారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. అప్పటి ఈ ప్రకటనను తన ఫ్రెండ్ ఒకరు తనకు పంపించారని ఆనంద్ మహీంద్రా తెలిపారు. అవి చాలా మంచి రోజులని, అప్పట్లో ధరలు అందుబాటులో ఉండేవని ఆనంద్ర మహీంద్రా గుర్తు చేసుకున్నారు. అయితే, ఈ ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. తమకు డిస్కౌంట్ లేకపోయినా పర్లేదు కానీ, అదే ధరకు జీప్ ఇమ్మంటున్నారు. టైమ్ ట్రావెల్ చేసైనా, ఈ జీప్ దక్కించుకోవాలని ఇంకొకరు అంటున్నారు. 

Updated Date - 2022-03-06T20:03:38+05:30 IST