Rajiv Gandhi assassination case: దోషుల విడుదలకు మద్రాస్ హైకోర్టు తిరస్కరణ

ABN , First Publish Date - 2022-06-17T20:48:56+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న

Rajiv Gandhi assassination case: దోషుల విడుదలకు మద్రాస్ హైకోర్టు తిరస్కరణ

చెన్నై : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న దోషులు నళిని శ్రీహరన్, పి రవిచంద్రన్‌లను శిక్షా కాలం పూర్తి కాకుండా విడుదల చేసేందుకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు ఉన్నట్లుగా తనకు ప్రత్యేక అధికారాలు లేవని తెలిపింది. ఇదే కేసులో దోషి ఏజీ పెరారివలన్‌ను మే నెలలో సుప్రీంకోర్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 


నళిని (Nalini Sriharan), రవిచంద్రన్ (Ravichandran) దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు (Madrass High Court) విచారణ జరిపింది. తమిళనాడు (Tamilnadu) రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో గవర్నర్ విఫలమయ్యారని, గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. గవర్నర్ ఆమోదం లేకుండానే తక్షణమే జైలు నుంచి తమను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 


ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ, జస్టిస్ ఎన్ మాల హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, భారత రాజ్యాంగంలోని అధికరణ 142 ప్రకారం సుప్రీంకోర్టు (Supreme Court)కు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని తెలిపింది. అటువంటి అధికారాలు హైకోర్టుకు లేవని చెప్పింది. 2022 మే నెలలో Rajiv Gandhi Assassination కేసులో ఏజీ పెరారివలన్‌ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా తాను ఆదేశించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్తూ, దానిని తోసిపుచ్చింది. పెరారివలన్‌ను విడుదల చేయడాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ పిటిషన్లను దాఖలు చేసి ఉంటే, పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది. 


మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో హత్యకు గురయ్యారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) ఆత్మాహుతి బాంబర్ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో మురుగన్ వురపు శ్రీహరన్, నళిని, ఏజీ పెరారివలన్, సంతాన్, జయకుమార్, రాబర్ట్ పయస్, పి రవిచంద్రన్ దోషులుగా కోర్టు తీర్పు చెప్పింది. 


Updated Date - 2022-06-17T20:48:56+05:30 IST