Madhurai ఆలయ ప్రాంగణంలో ఆస్పత్రి
ABN , First Publish Date - 2022-06-21T15:56:16+05:30 IST
మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకొనే సమయంలో అస్వస్థతకు గురైన భక్తులకు అత్యవసర చికిత్స అందించేలా హిందూ దేవాదాయ శాఖ

పెరంబూర్(చెన్నై), జూన్ 20: మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకొనే సమయంలో అస్వస్థతకు గురైన భక్తులకు అత్యవసర చికిత్స అందించేలా హిందూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఏర్పాటుకానుంది. ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఈ ఆలయానికి ప్రతిరోజు సుమా రు 50 వేల మందికి పైగా భక్తులు వస్తున్నారు. దర్శనం కోసం ఎక్కువ సేపు క్యూలైన్లలో వేచి ఉన్న పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోవడం, గుండెపోటుకు గురికావడంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్స్ ఉంది. ఈ నేపథ్యంలో, ఆలయ ప్రాంగణంలో ఆస్పత్రి ఏర్పాటుచేయాలని హిందూ దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ విషయమై ఆలయ నిర్వహణాధికారి ఒకరు మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్ధం ఆస్పత్రి ఏర్పాటుచేయాలని రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు, నర్సులు, సహాయకులు, సిబ్బందిని నియమిస్తారని, అస్వస్థతకు గురైన భక్తులకు ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తామని తెలిపారు. ఆలయంలోని ఓ భవనంలో పడక వసతితో ఆస్పత్రి ఏర్పాటుకానుందన్నారు. వైద్యులు, నర్సుల పోస్టులకు హిందూ మతానికి చెందిన రాష్ట్ర పౌరులు అర్హులని, ఆసక్తి కలిగిన వారు www.maduraimee nakshi.org, www.tnhrce.gov.in అనే వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.