సుప్రీంకోర్టు వాదనల ప్రత్యక్ష ప్రసారం

ABN , First Publish Date - 2022-09-28T07:12:55+05:30 IST

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఏవిధంగా వాదనలు వినిపిస్తారు? అసలు సుప్రీం కోర్టు కార్యకలాపాలు ఎలా సాగుతాయి? ఇవన్నీ అత్యంత ఆసక్తికర విషయాలు.

సుప్రీంకోర్టు వాదనల ప్రత్యక్ష ప్రసారం

రాజ్యాంగ ధర్మాసనం కార్యకలాపాల లైవ్‌.. చరిత్రలో తొలిసారి ప్రజలకు మరింత చేరువ

తొలిరోజు ‘శివసేన’ పిటిషన్‌పై విచారణ

యూట్యూబ్‌ సహా ఇతర వేదికల్లో ప్రసారం

ప్రసారాలకు త్వరలోనే ‘ప్రత్యేక వేదిక’


న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఏవిధంగా వాదనలు వినిపిస్తారు? అసలు సుప్రీం కోర్టు కార్యకలాపాలు ఎలా సాగుతాయి? ఇవన్నీ అత్యంత ఆసక్తికర విషయాలు. అయితే, ఆయా విషయాలు ఇప్పటి వరకు.. నేరుగా కోర్టుకు హాజరైన వారికి మాత్రమే పరిశీలించే వీలుంది. కానీ, తాజాగా మంగళవారం సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారంలో దేశ ప్రజలు వీక్షించే అవకాశం కల్పించారు. సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలో కార్యకలాపాలను లైవ్‌ ప్రసారం చేయడం, అందునా తొలిసారి కావడం విశేషం. మంగళవారం మహారాష్ట్రకు చెందిన ‘శివసేన వర్సెస్‌ శివసేన’ పిటిషన్‌పై రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. సుప్రీం కోర్టులో మూడు రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నాయి. వీటిలో న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రెండో రాజ్యాంగ ధర్మాసనం మహారాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన వివాదానికి సంబంధించిన శివసేన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సీఎం ఏక్‌నాథ్‌ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను గత ఆగస్టులో న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇదిలావుంటే, లైవ్‌ ప్రసారాలకు యూట్యూబ్‌కు బదులుగా ‘తగిన వేదిక’ను ఏర్పాటు చేస్తామని.. సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ చెప్పారు. ఇక, ఇటీవల పూర్తిస్థాయి బెంచ్‌ న్యాయమూర్తులు సమావేశమై.. ఈ నెల 27(మంగళవారం) నుంచి అన్ని ధర్మాసనాల కార్యకలాపాలను లైవ్‌లో ప్రసారం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ప్రత్యక్ష కార్యకలాపాలను యూట్యూబ్‌లో ప్రసారం చేస్తారు. అనంతరం సర్వర్‌లోనూ నిక్షిప్తం చేస్తారు. ప్రజలు వారి సెల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, కంపూటర్లలోనూ.. వీటిని వీక్షించే అవకాశం కల్పిస్తారు. 


సెప్టెంబరు 27నే ఎందుకు?

సుప్రీంకోర్టు విచారణలను సెప్టెంబరు 27వ తేదీనే ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కీలకమైన కారణం ఉంది. 2018లో సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్‌ వేశారు. ‘‘కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవకాశం ఇవ్వండి. ముఖ్యమైన కేసుల్లో విచారణ ఎలా జరుగుతోందో కోర్టుకు రాలేని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వండి. వారికి కూడా ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి’’ అని అభ్యర్థించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం..  2018, సెప్టెంబరు 27న అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా దీనికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనికి గుర్తుగా సెప్టెంబరు 27ను ఎంచుకున్నట్టు సుప్రీం కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. 


ఏది అసలైన శివసేనో తేల్చండి!

ఎన్నికల సంఘానికి సుప్రీం సిఫారసు

నిజమైన శివసేనగా తమ పార్టీనే గుర్తించాలని.. పార్టీ ఎన్నికల గుర్తయిన ‘విల్లంబు’ను తమకే కేటాయించాలని కోరుతూ.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం  రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘానికి రిఫర్‌ చేసింది. ‘ఏది అసలైన శివసేనో తేల్చండి’ అని పేర్కొంది. ఇదేసమయంలో సీఎం ఏక్‌నాథ్‌, ఆయన వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని కోరుతూ మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఎన్నికల సంఘం ముందు జరిగే విచారణపై స్టే ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నాం’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహల రా జ్యాంగ విస్తృత ధర్మాసనం ఉద్దవ్‌కు తేల్చి చెప్పింది. 


‘రూల్‌ ఆఫ్‌ మెజారిటీ’తో తేలుస్తాం: ఈసీ

అహ్మదాబాద్‌: మహారాష్ట్రలో ‘అసలు శివసేన’ ఏ గ్రూపుదో నిర్ణయించడానికి ‘రూల్‌ ఆఫ్‌ మెజారిటీ’ని అనుసరిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం గాంధీనగర్‌లో  ఆయన విలేకరులతో మాట్లాడారు. 

Read more