ఎల్‌ఐసీ ఏజెంట్ల్లలా.. ఆటో డీలర్లలా

ABN , First Publish Date - 2022-09-19T07:09:34+05:30 IST

పాతికేళ్ల క్రితం జరిగిన హత్య. సాక్షుల్లేరు. ఆధారాల్లేవు. నిందితుడి ఫొటో కూడా లేదు.

ఎల్‌ఐసీ ఏజెంట్ల్లలా.. ఆటో డీలర్లలా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: పాతికేళ్ల క్రితం జరిగిన హత్య. సాక్షుల్లేరు. ఆధారాల్లేవు. నిందితుడి ఫొటో కూడా లేదు. ఈ కేసులో నిందితున్ని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు ఎల్‌ఐసీ ఏజెంట్ల అవతారం ఎత్తారు. ఈ-ఆటో డీలర్లలా మారారు. చివరకు నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేశారు. ఢిల్లీలోని తుగ్లకాబాద్‌కు చెందిన రోజువారీ కూలీ కిషన్‌లాల్‌ను 1997 ఫిబ్రవరిలో ఎవరో పొడిచి చంపేశారు. అతని భార్య సునీత(అప్పుడు గర్భిణి) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిషన్‌ లాల్‌ ఇంటి దగ్గర ఉండే రామును హంతకుడిగా అనుమానించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసును ఛేదించలేక ఆ సంగతి మర్చిపోయారు. పాత కేసులను ఛేదించడంపై ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఢిల్లీ నార్త్‌ డిస్ట్రిక్ట్‌ పోలీసు బృందం కిందటేడాది ఆగస్టులో కేసు దర్యాప్తును మళ్లీ మొదలుపెట్టింది. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఉంటున్న రాము బంధువుల ఇంటికి పోలీసులు ఎల్‌ఐసీ ఏజెంట్ల రూపంలో వెళ్లారు. వారిచ్చిన సమాచారంతో రాము కుమారుడు ఆకాశ్‌ను గుర్తించి తండ్రి గురించి అడిగారు. లఖ్‌నవూలో ఆటో నడుపుతున్నట్లు చెప్పడంతో పోలీసులు ఈ సారి ఈ-రిక్షా కంపెనీ డీలర్ల అవతారంలో వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు.

Updated Date - 2022-09-19T07:09:34+05:30 IST