LIC : మిశ్రమ బీమా సంస్థగా ఎల్‌ఐసీ!

ABN , First Publish Date - 2022-12-10T01:30:36+05:30 IST

ప్రభుత్వ రంగ బీమా సంస్థలను బలోపేతం చేయాలని కేంద్రం యోచిస్తోంది. అందులో భాగంగా భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ను మిశ్రమ(కాంపోజిట్‌) బీమా సంస్థగా మార్చాలని భావిస్తోంది. జీవిత బీమా, నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను విక్రయించే సంస్థనే

LIC : మిశ్రమ బీమా సంస్థగా ఎల్‌ఐసీ!

సంస్థలో 4 ప్రభుత్వ రంగ బీమా కంపెనీల విలీనం

ఓరియంటల్‌, నేషనల్‌, న్యూ ఇండియా, యునైటెడ్‌

ఇండియా కంపెనీలను కలిపేయాలని కేంద్రం యోచన

ఆ మేరకు చట్టాల్లో సవరణలకు ప్రతిపాదన

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ప్రభుత్వ రంగ బీమా సంస్థలను బలోపేతం చేయాలని కేంద్రం యోచిస్తోంది. అందులో భాగంగా భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ను మిశ్రమ(కాంపోజిట్‌) బీమా సంస్థగా మార్చాలని భావిస్తోంది. జీవిత బీమా, నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను విక్రయించే సంస్థనే మిశ్రమ బీమా సంస్థగా పేర్కొంటారు. దేశంలోని నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలను (ఆస్తులు, వాహనాలు వంటి వాటికి బీమా చేసేవి) ఎల్‌ఐసీలో విలీనం చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు బీమా చట్టం 1938; బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ చట్టం 1999కి పలు సవరణలు చేయాలని యోచిస్తోంది. మిశ్రమ బీమా సంస్థలను అనుమతించడం; సంస్థలకు అవసరమైన కనీస పెట్టుబడిని నిర్ధారించే అధికారాన్ని బీమా నియంత్రణ సంస్థకు అప్పగించడం; చట్టపరమైన పరిమితులను రద్దు చేయడం; పెట్టుబడుల నిబంధనలను మార్చడం; క్యాప్టివ్‌లు సహా పలు రకాల బీమా సంస్థలను అనుమతించడం వంటి సవరణలు చేయాలని ప్రతిపాదించింది. ది ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, ద న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థలను ఎల్‌ఐసీలో విలీనం చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రణాళికా రంగంలో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండొచ్చని..

ప్రణాళికేతర రంగంలో మాత్రం కేవలం ఒక్కటే ప్రభుత్వ రంగ సంస్థ ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గతంలోనే ప్రకటించారని బీమా రంగం అధికారి ఒకరు గుర్తుచేశారు. ఈ ప్రకటన ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నాలుగు జీవిత బీమాయేతర ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఎల్‌ఐసీలో కలిపే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదన పట్ల ఆ నాలుగు బీమా సంస్థల ఉద్యోగులు కూడా సుముఖంగా ఉన్నారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థలను బలోపేతం చేసే ఏ చర్యనైనా తాము స్వాగతిస్తామని అఖిల భారత సాధారణ బీమా ఉద్యోగుల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి త్రిలోక్‌సింగ్‌ చెప్పారు. కేంద్రం ప్రతిపాదించిన చట్ట సవరణలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే కొన్నేళ్ల క్రితం కూడా ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, నేషనల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా కంపెనీలను విలీనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు.

Updated Date - 2022-12-10T01:30:37+05:30 IST