కర్తార్‌పూర్ విభజన పొరపాటు: అమిత్ షా
ABN , First Publish Date - 2022-03-18T20:39:39+05:30 IST
దేశ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కర్తార్‌పూర్ గురుద్వార సాహిబ్ పాకిస్తాన్‌కు చెందడం విభజన సమయంలో జరిగిన పొరపాటు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్‌పీఏఐ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.

దేశ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కర్తార్‌పూర్ గురుద్వార సాహిబ్ పాకిస్తాన్‌కు చెందడం విభజన సమయంలో జరిగిన పొరపాటు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్‌పీఏఐ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశ విభజన సమయంలో పొరపాటు జరిగింది. పాకిస్తాన్లో ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్ మనకు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినా అది పాకిస్తాన్‌కే దక్కింది. ఈ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. గురునానక్ జయంతి ఉత్సవాలు జరిగినప్పుడల్లా ఈ ప్రదేశం పాక్‌లో ఉండిపోవడం బాధ కలిగిస్తుంది’’ అన్నారు.
సిక్కులకు ఎంతో పవిత్రమైన గురుద్వారా దర్బార్ సాహిబ్ పాక్‌లోని కర్తార్‌పూర్‌లో ఉండగా, గురుద్వారా డేరా బాబా నానక్ భారత్‌లో ఉంది. అయితే, రెండు ప్రదేశాలను దర్శించుకోవాలనుకునే సిక్కులకు దేశాల మధ్య ఉన్న విబేధాలు సమస్యగా మారాయి. దీంతో ఇరు దేశాల్లోని గురుద్వారాలను కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్ తీసుకురావాలని రెండు దశాబ్దాల కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. చివరకు దీన్ని 2019లో ప్రారంభించారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రకారం... భారత దేశానికి చెందిన సిక్కులు, హిందువులు పాక్‌లోని గురుద్వారాను వీసా లేకుండానే దర్శించుకోవచ్చు. అయితే, పాక్ సిక్కులు మాత్రం ఇండియాలోని గురుద్వారాను దర్శించుకోవాలంటే వీసా తీసుకోవాలి. ఈ కారిడార్‌ను నిర్వహిస్తోంది ఎల్‌పీఏఐ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, సిక్కుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ఎల్‌పీఏఐ కీలకపాత్ర పోషిస్తోందని అమిత్ షా అన్నారు. భారత సరిహద్దు దేశాల విషయంలో కూడా కీలకపాత్ర పోషిస్తుందని ప్రశంసించారు.