ఏకమవుదాం.. కలిసి పనిచేద్దాం

ABN , First Publish Date - 2022-09-08T08:11:46+05:30 IST

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది.

ఏకమవుదాం.. కలిసి పనిచేద్దాం

ప్రతిపక్ష నేతలకు నితీశ్‌ పిలుపు.. ముగిసిన నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ‘మిషన్‌ 2024’లో భాగంగా ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బుఽధవారం ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌.. సీపీఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌తో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో నితీశ్‌ మాట్లాడారు. బిహార్‌లో మొత్తం ఏడు పార్టీలు ఒక్కటయ్యాయని, ప్రతిపక్షంలో బీజేపీ ఒంటరైందన్నారు. బీజేపీ వ్యతిరేకిస్తున్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు తాను అందరినీ కలుస్తున్నానని చెప్పారు. బీజేపీని వీడిన తర్వాత మంచిపని చేశారని ప్రజలంతా అభినందిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్నికల్లో పోరాడితే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ‘అందరూ ఐక్యంగా ఉంటే ఎంతో మేలు జరుగుతుందనేది లక్ష్యం. ఇందులో నా వ్యక్తగత ప్రయోజనాలేమీ లేవు. నాకు ప్రధాని పీఠంపై దృష్టిలేదు’ అన్నారు. సోనియా గాంధీ విదేశాల నుంచి వచ్చిన తరువాత ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు.  

Read more