లెజెండరీ సూపర్‌స్టార్‌ కృష్ణ

ABN , First Publish Date - 2022-11-16T03:39:20+05:30 IST

కృష్ణ లెజెండరీ సూపర్‌ స్టార్‌ అని, ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

లెజెండరీ సూపర్‌స్టార్‌ కృష్ణ

ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు: మోదీ.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర: కేసీఆర్‌

కృష్ణ మన అల్లూరి, మన జేమ్స్‌బాండ్‌: జగన్‌

తెలుగు చిత్రసీమకు తీరని లోటు: రజనీకాంత్‌

టాలీవుడ్‌లో శిఖరాగ్ర నటుడు: కమల్‌హాసన్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/చెన్నై, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కృష్ణ లెజెండరీ సూపర్‌ స్టార్‌ అని, ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ తన నటనా కౌశలం, స్నేహపూర్వక వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ఈ విషాద సమయంలో మహేశ్‌బాబుకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని ట్వీట్‌ చేశారు. కృష్ణ మృతిపట్ల తెలంగాణ, ఏపీ, తమిళనాడు సీఎంలు కేసీఆర్‌, జగన్‌, స్టాలిన్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖ నటులు సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కేసీఆర్‌ పేర్కొన్నారు. నాటి కార్మిక కర్షక లోకం సూపర్‌స్టార్‌ను తమ అభిమాన హీరోగా సొంతం చేసుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఒక ప్రకటనలో కృష్ణ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణ తెలుగువారి సూపర్‌ స్టార్‌ అని, అయనే అల్లూరి, ఆయనే మన జేమ్స్‌బాండ్‌’ని జగన్‌ నివాళి అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సాహసాలకు, కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందని స్టాలిన్‌ కొనియాడారు. కృష్ణ ధైర్య సాహసాలు, పట్టుదల, మానవీయత కలగలిసిన మనిషి అని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు. కృష్ణతో కలిసి మూడు చిత్రాల్లో నటించానని, ఆ ఙ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గుర్తుచేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసిందని విశ్వనటుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. సాహసానికి మరోపేరు కృష్ణ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ కొనియాడారు. సీనియర్‌ నటి ‘ఊర్వశి’ శారద, నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌, నటులు విజయకాంత్‌, సూర్య, విశాల్‌, రాజేందర్‌, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌లు కృష్ణ మృతికి సంతాపం తెలిపారు.

సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది: చంద్రబాబు

అమరావతి: సూపర్‌స్టార్‌ కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సోదరుడిని, తల్లిని, తండ్రిని కోల్పోయిన మహేశ్‌బాబు ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. విభిన్న పాత్రులతో కృష్ణ చేసిన ప్రయోగాలు, సృష్టించిన రికార్డులు సినీ రంగానికి మార్గదర్శకమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కంభంపాటి రామ్మోహన్‌రావు, పోలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ రాజకుమారిలు కృష్ణ మృతికి సంతాపం తెలిపారు.

బీజేపీ, వామపక్ష నేతల సంతాపం

సమాజాన్ని తట్టి లేపేలా కృష్ణ సినిమాలు నిర్మించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కొనియాడారు. జేమ్స్‌బాండ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్ఱర్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. తాను నమ్మిన ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడి ఉన్న హీరో కృష్ణ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్సింలు, అరవింద్‌గౌడ్‌ నివాళి అర్పించారు. తాను పోషించిన పాత్రలతో కృష్ణ ప్రత్యేకత చాటుకున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఆయన ఎన్నో సామాజిక చిత్రాలు తీసి ప్రేక్షకులను అలరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కృష్ణ మృతి సినీ రంగానికి తీరనిలోటు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

తెలుగు సినీ చరిత్రలో కృష్ణకు ప్రత్యేక స్థానం: కేటీఆర్‌

అద్భుతమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా విభిన్న కథా చిత్రాల హీరోగా సూపర్‌ స్టార్‌ కృష్ణకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు కృష్ణ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

మార్గదర్శకంగా నిలిచారు: రాహుల్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ వృత్తిపరంగా క్రమశిక్షణ, విలువలు పాటించి మార్గదర్శకంగా నిలిచారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్‌ నేత వీ హనుమంతరావు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌లు సంతాపం వ్యక్తం చేశారు.

నాపై కాల్పులను ఖండించారు: గద్దర్‌

సూపర్‌ కృష్ణ పార్థివదేహానికి ప్రజా గాయకుడు గద్దర్‌ కాంటినెంటల్‌ అస్పత్రిలో నివాళులు అర్పించారు. తనపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినప్పడు దాన్ని ఖండించి కృష్ణ తనకు అండగా నిలిచారన్నారు. నటులు ఎంతమంది ఉన్నా శాంతిని కోరే మంచి మనిషి కృష్ణ అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ అన్నారు.

Updated Date - 2022-11-16T03:39:20+05:30 IST

Read more