మోదీ, నితీశ్‌లకు పిల్లలు పుట్టాలని ప్రార్థిస్తున్నా : లాలూ

ABN , First Publish Date - 2022-02-11T21:34:17+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లకు

మోదీ, నితీశ్‌లకు పిల్లలు పుట్టాలని ప్రార్థిస్తున్నా : లాలూ

పాట్నా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లకు పిల్లలు పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. వారికి పిల్లలు పుట్టాలని, వారు కూడా వంశపారంపర్య రాజకీయాలనే వాదనలో చేరాలని కోరుకుంటున్నానన్నారు. మోదీ బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చేటు తెస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే. 


‘‘నితీశ్ కుమార్, పీఎం మోదీలకు పిల్లలు లేకపోతే నేనేం చేయగలను? నితీశ్ కుమార్‌కు ఓ కుమారుడు ఉన్నాడు, కానీ ఆయన రాజకీయాలకు తగినవాడు కాదు. నేనేం చేయగలను? వారు కూడా వంశపారంపర్య రాజకీయాల్లోకి చేరే విధంగా వారికి కూడా పిల్లలు పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని లాలూ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.


మోదీ బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను సమాజం కోసం ఉన్నానని చెప్పారు. బూటకపు సామ్యవాదమంటే వంశపారంపర్య రాజకీయాలని చెప్పారు. లోహియా కుటుంబాన్ని ఎక్కడైనా చూశారా? అని అడిగారు. ఆయన సామ్యవాది అని తెలిపారు. జార్జి ఫెర్నాడెంజ్ కుటుంబాన్ని చూశారా? అని ప్రశ్నించారు. ఆయన కూడా సామ్యవాది అన్నారు. నితీశ్ కుమార్ తమతో కలిసి పని చేస్తున్నారని, ఆయన కూడా సామ్యవాది అని తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఎప్పుడైనా చూశారా? అని అడిగారు.  ఓ పార్టీని తరతరాలు ఓ కుటుంబం నడిపితే, దానిలో వంశపారంపర్యమే ఉంటుందని, డైనమిక్స్ ఉండవని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువు అని తెలిపారు. 


Updated Date - 2022-02-11T21:34:17+05:30 IST