Jammu and Kashmir : కశ్మీరులో నెహ్రూ తప్పిదాలను గుర్తు చేసిన కిరణ్ రిజిజు
ABN , First Publish Date - 2022-10-27T15:53:09+05:30 IST
జమ్మూ-కశ్మీరు విషయంలో అక్టోబరు 27కు ఉన్న ప్రాధాన్యాన్ని రెండు రకాలుగా చూడాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరు విషయంలో అక్టోబరు 27కు ఉన్న ప్రాధాన్యాన్ని రెండు రకాలుగా చూడాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. విలీన ఒడంబడిక ద్వారా జమ్మూ-కశ్మీరు భారత దేశంలో విలీనమై 75 సంవత్సరాలవుతుండటం ఒకటి కాగా, ఈ తేదీకి ముందు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ చేసిన మహా తప్పులకు 75 సంవత్సరాలవుతుండటం మరొకటి అని తెలిపారు. ఓ వార్తా పత్రిక కోసం రాసిన వ్యాసంలో కిరణ్ రిజిజు వెల్లడించినవాటిలో ముఖ్యాంశాలు ఏమిటంటే...
1947లో భారత దేశ విభజన కేవలం బ్రిటిష్ ఇండియాకు మాత్రమే వర్తిస్తుంది. సంస్థాన రాజ్యాలు భారత దేశం, పాకిస్థాన్‌లలో ఏదో ఒకదానిలో కలవవచ్చు. వాటికి ఆ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఉన్నాయి. ఆ సంస్థాన రాజ్యాల్లోని ప్రజలతో సంప్రదింపులు జరపాలనే నిబంధన ఏదీ లేదు. విలీనానికి సంబంధించిన అన్ని అంశాలను సంబంధిత రాజ్యాన్ని పరిపాలించే పాలకులు తాము భారత దేశంలో చేరాలనుకుంటే, ఆ దేశంతోనూ, పాకిస్థాన్‌లో చేరాలనుకుంటే ఆ దేశంతోనూ సంప్రదించి, నిర్ణయం తీసుకోవచ్చు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సారథ్యంలో దేశంలోని దాదాపు 560 రాజ్యాలు భారత దేశంలో 1947 ఆగస్టు 15కు పూర్వమే విలీనమయ్యాయి. హైదరాబాద్, జునాగఢ్ రాజ్యాలు మాత్రమే సమస్యాత్మకంగా మారాయి. కానీ వీటిని సర్దార్ పటేల్ భారత దేశంలో విలీనం చేశారు.
ఏడు దశాబ్దాల నుంచి చొప్పించిన చారిత్రక అబద్ధం ఏమిటంటే, కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం. మహారాజా హరి సింగ్ సమస్యలు సృష్టించారని చెప్పడం. ఆయన భారత దేశంలో చేరడానికి తటపటాయించారని చెప్పడం చారిత్రక అబద్ధం. అసలు కశ్మీరు విషయంలో సమస్యలను సృష్టించినవారు జవహర్లాల్ నెహ్రూ. ఆయన తన వ్యక్తిగత ఎజెండాతో సమస్యలను సృష్టించారు. మహారాజా హరి సింగ్ ఎటువంటి సమస్యను సృష్టించలేదు.
నెహ్రూ చేసిన ఐదు తప్పులు భారత దేశాన్ని ఏడు దశాబ్దాలపాటు వెంటాడాయి. అవి ఏమిటంటే...
1. భారత దేశంలో కశ్మీరు విలీనానికి 1947 జూలైలోనే మహారాజా హరి సింగ్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడం. జవహర్లాల్ నెహ్రూ తన వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకోవడం కోసం ఈ విజ్ఞప్తిని తిరస్కరించారు.
2. అంతిమ విలీనాన్ని తాత్కాలికమైనదిగా ప్రకటించడం.
3. అధికరణ 51 ప్రకారం కాకుండా, అధికరణ 35 ప్రకారం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడం.
4. ఏది ఏమైనా ఐక్య రాజ్య సమితి ఆదేశాలతో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) అనేది ఓ బహిరంగ ప్రశ్న అనే భావాన్ని వ్యాపించనివ్వడం.
5. రాజ్యాంగంలో అధికరణ 370ని సృష్టించడం ద్వారా వేర్పాటువాద ఆలోచనా విధానాన్ని వ్యవస్థీకృతం చేయడం.
నెహ్రూ చేసిన ఈ ఐదు తప్పుల వల్ల భారత దేశం ఏడు దశాబ్దాలను కోల్పోయిందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. భారత దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుందన్నారు. చివరికి 2019లో చరిత్ర ఓ మలుపు తిరిగిందని చెప్పారు. భారత దేశానికే పెద్ద పీట అనే సిద్ధాంతం వల్ల ఈ మేలు మలుపు సాధ్యమైందన్నారు. నెహ్రూ చేసిన ఈ ఐదు తప్పులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 5న తుడిచేశారన్నారు. అధికరణ 370ని రద్దు చేసి, ఆ ప్రాంతాన్ని సంపూర్ణంగా భారత దేశంలో కలిపారని తెలిపారు.
1947 అక్టోబరు 27న భారత వాయు సేన (Indian Air Force) శ్రీనగర్‌లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీనగర్‌లో గురువారం శౌర్య దినోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.