Ola, Uber and Rapido : ఆటో రిక్షా రైడ్స్‌ ఆపండి : కర్ణాటక ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-10-07T23:30:45+05:30 IST

ఓలా, ఊబర్, రేపిడో నడుపుతున్న ఆటో రిక్షాల ఛార్జీలు

Ola, Uber and Rapido : ఆటో రిక్షా రైడ్స్‌ ఆపండి : కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు : ఓలా, ఊబర్, రేపిడో నడుపుతున్న ఆటో రిక్షాల ఛార్జీలు విపరీతంగా ఉంటున్నాయని ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. లైసెన్స్ లేని ఆటో రిక్షా రైడ్స్‌ను మూడు రోజుల్లోగా నిలిపేయాలని, లేదంటే చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధపడాలని ఈ సంస్థలకు గురువారం నోటీసులిచ్చింది. 


కర్ణాటక రవాణా శాఖ గురువారం Ola, Uber, Rapido లకు ఇచ్చిన సర్క్యులర్‌లో, లైసెన్స్ లేని ఆటో రిక్షా రైడ్స్‌ను మూడు రోజుల్లోగా నిలిపేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్యాబ్ అగ్రిగేటర్లు, వాహనాల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 


కర్ణాటక రవాణా శాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, Ola, Uber, Rapido యాప్స్‌ను నిరంతరం గమనిస్తున్నామన్నారు. ఈ సంస్థలు నడుపుతున్న ఆటో రిక్షాల ప్రయాణ ఛార్జీలు అధికంగా ఉంటున్నాయనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. తాము పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఈ సంస్థలు తమ తీరును మార్చుకోవడం లేదని చెప్పారు. క్యాబ్ అగ్రిగేటర్లు ఆటో రిక్షా సేవలను అందజేయడం చట్టవిరుద్ధమని పరిగణించాలని  గురువారం జరిగిన సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. 


ఈ యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షాకు కనీస ఛార్జీ రూ.30 కాగా ప్రయాణికుల నుంచి రూ.100 వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటో రిక్షాలకు మొదటి రెండు కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.15 చొప్పున వసూలు చేయవచ్చు. 


కేవలం క్యాబ్ సర్వీసులను అందజేయడానికి మాత్రమే ఓలా, ఊబర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లకు అనుమతి ఉందని ఈ సర్క్యులర్ తెలిపింది. డ్రైవర్ మినహా ఆరు సీట్ల కెపాసిటీగల మోటార్ క్యాబ్‌ సేవలను క్యాబ్ సర్వీస్‌గా పరిగణిస్తారు. 


Updated Date - 2022-10-07T23:30:45+05:30 IST