సుప్రీం కోర్టుపై నాకు ఆశల్లేవు..

ABN , First Publish Date - 2022-08-09T06:32:40+05:30 IST

సుప్రీం కోర్టుపై తనకు ఎలాంటి ఆశల్లేవని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అన్నారు. ఇటీవలి కాలంలో సుప్రీం వెలువరించిన పలు తీర్పులను తప్పుబడుతూ ఆయన ఈ

సుప్రీం కోర్టుపై నాకు ఆశల్లేవు..

సున్నితమైన కేసులన్నీ ‘కొంతమంది’ జడ్జీలకే

కపిల్‌ సిబల్‌ సంచలన వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, ఆగస్టు 8: సుప్రీం కోర్టుపై తనకు ఎలాంటి ఆశల్లేవని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అన్నారు. ఇటీవలి కాలంలో సుప్రీం  వెలువరించిన పలు తీర్పులను తప్పుబడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో రాజకీయంగా సున్నితమైన కేసులన్నీ ‘కొంతమంది’ జడ్జీల ముందుకే విచారణకు వెళ్తాయన్నారు. 50 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేసిన సుప్రీం కోర్టును విమర్శించడం బాధాకరమే కానీ... ఇంత అనుభవం తర్వాత కూడా ఈ విషయాల గురించి తాను మాట్లాడకపోతే మరెవరు మాట్లాడతారని సిబల్‌ ప్రశ్నించారు. న్యూఢిల్లీలో పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ తదితర సంస్థలు నిర్వహించిన సదస్సులో ఆయన ఈ మేరకు మాట్లాడారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో... సిట్‌ దర్యాప్తులో లోపాలకు సంబంధించిన ఆధారాలన్నింటినీ తాను సమర్పించినా సుప్రీం కోర్టు ఏమీ చేయలేకపోయిందన్నారు.


అలాగే... మనీలాండరింగ్‌ కేసుల విషయంలో ఈడీ విస్తృత అధికారాలను సుప్రీం సమర్థించడాన్ని తప్పుబట్టారు. ఓవైపు వ్యక్తుల ప్రైవసీ హక్కును సమర్థిస్తూ... మరోవైపు దర్యాప్తు పేరుతో ఈడీ నేరుగా ఇళ్లల్లోకి వెళ్లడానికి కోర్టు అనుమతివ్వడం సరికాదన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లో ఆదివాసీల ఊచకోతపై స్వతంత్ర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టేయడం, అలాగే ధర్మ సంసద్‌ ప్రసంగాల కేసులో సుప్రీం కోర్టు తీర్పును కపిల్‌ సిబల్‌ తప్పుబట్టారు. ఇదిలా ఉండగా.. సిబల్‌ వ్యాఖ్యలను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఖండించారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయని, వాటిపై ఎలాంటి విమర్శలనైనా వ్యతిరేకించాల్సిందేనని ఆయన అన్నారు. మనీలాండరింగ్‌ చట్టాన్ని యూపీఏ హయాంలో, సిబల్‌ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే తెచ్చారని, ఇప్పుడు ఆయనే ఆ చట్టాన్ని విమర్శిస్తున్నారని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ వ్యాఖ్యానించారు. సిబల్‌ వంటి సీనియర్‌ న్యాయవాది కోర్టును అవమానించడం సరికాదని సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు మహేశ్‌ జెఠ్మలానీ పేర్కొన్నారు. మరోవైపు... సిబల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతివ్వాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు లేఖలు రాశారు.

Updated Date - 2022-08-09T06:32:40+05:30 IST