అమ్మతో జోడో యాత్ర

ABN , First Publish Date - 2022-10-07T09:39:55+05:30 IST

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చాలాకాలం తర్వాత ప్రజల మధ్యకు వచ్చారు.

అమ్మతో జోడో యాత్ర

సోనియా భుజంపై చేయివేసి రాహుల్‌ నడక

తల్లికి షూ లేసులు కట్టిన అగ్రనేత


బెంగళూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చాలాకాలం తర్వాత ప్రజల మధ్యకు వచ్చారు. తన కుమారుడు రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్రలో ఆమె పాల్గొన్నారు. గురువారం కర్ణాటకలోని మండ్య జిల్లాలో రాహుల్‌తో కలసి సోనియా పాదయాత్ర చేయడం కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది. రాహుల్‌ తన తల్లికి ఆసరాగా కాసేపు ఆమె భుజం చుట్టూ చేయి వేసి నడిపించారు. విజయదశమి సందర్భంగా రెండురోజుల విశ్రాంతి తర్వాత పాండవపుర తాలూకా పరిధిలోని బెళ్ళాలె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పాదయాత్ర పునఃప్రారంభమైంది. తల్లి భుజం చుట్టూ చేయి వేసి నడుస్తున్న ఫొటోను ట్విటర్‌లో రాహుల్‌ పోస్టు చేశారు. ఈ ఏడాది మొదట్లో కొవిడ్‌ నుంచి సోనియా కోలుకున్నాక బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఆమెను చూసేందుకు ప్రజలు, పార్టీ కేడర్‌ పెద్దఎత్తున వచ్చారు. కాగా.. పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సోనియా షూలేసులు ఊడిపోవడంతో ఆమె ఇబ్బంది పడుతుండటాన్ని రాహుల్‌ గుర్తించారు. ఆయన వెంటనే మోకాళ్లపై కూర్చుని షూ లేసులను కట్టి సరిచేశారు. 


మహదేశ్వర ఆలయం సందర్శన: సోమవారం సోనియా మైసూరు చేరుకున్నారు. అక్కడి నుంచి కొడుగు జిల్లాకు వెళ్లాల్సి ఉండగా, హెలికాప్టర్‌ ప్రయాణానికి వాతావరణం అనుకూలించలేదు. దీంతో మైసూరు పరిధి కబిని ప్రాంతంలో రిసార్టులో సేదతీరారు. బుధవారం ఇద్దరూ నాగరహొళె పులుల అభయారణ్యంలో సఫారీ చేశారు. విజయదశమి సందర్భంగా హెచ్‌డీ కోట తాలూకాలోని భీమనకొల్లి మహదేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T09:39:55+05:30 IST