Viral Vedio: జీసస్ ఒక్కడే నిజమైన దేవుడు, మీ శక్తిలాంటి వాడు కాదు: రాహుల్‌తో తమిళనాడు పాస్టర్

ABN , First Publish Date - 2022-09-10T20:30:23+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ''భారత్ జోడో యాత్ర''లో భాగంగా తమిళనాడుకు చెందిన ఒక వివాదాస్పద కేథలిక్ పాస్టర్‌ను..

Viral Vedio: జీసస్ ఒక్కడే నిజమైన దేవుడు, మీ శక్తిలాంటి వాడు కాదు: రాహుల్‌తో తమిళనాడు పాస్టర్

చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ''భారత్ జోడో యాత్ర''లో భాగంగా తమిళనాడుకు చెందిన ఒక వివాదాస్పద కేథలిక్ పాస్టర్‌ను (Controversiala catholic pastor) శుక్రవారంనాడు కలుసుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీజేపీ నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు. కన్యాకుమారి జిల్లాలో కేథలిక్ ప్రీస్ట్ జార్జి పొన్నయ్య (george ponniah)ను రాహుల్ గాంధీ (Rahul gandhi) కలుసుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో భాగంగా రాహుల్ గాంధీ ఆయనను ''ఏసుక్రీస్తు భగవంతుని రూపమా? అది నిజమేనా?'' అని ప్రశ్నించారు. వెంటనే జార్జి పొన్నయ్య తడుముకోకుండా ''ఆయన ఒక్కడే నిజమైన దేవుడు'' అని సమాధానమిచ్చారు. తన వాదన కొనసాగుస్తూ, భగవంతుడు మనిషి రూపంలోనే వెల్లడవుతాడు, మీ శక్తి లాంటి వాడు కాదంటూ పోలిక తెచ్చారు. దీంతో వివాదాస్పద పాస్టర్‌ను రాహుల్ కలుసుకోవడం, ఫాస్టర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు.


రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, వివాదాల్లో చిక్కుకోవడం జార్జి పొన్నయ్యకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, డీఎంకే మంత్రి, ఇతరులపై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై మదురైలోని కల్లికుడిలో గత ఏడాది ఆయనను అరెస్టు చేశారు. మార్నింగ్ బ్రేక్ కోసం పులియూర్‌కురిచ్చిలో రాహుల్ ఆగినప్పుడు ముట్టిడిచన్ పరయ్ చర్చిలో జార్జి పొన్నయ్యను కలుసుకున్నారు.


విరుచుకుపడిన బీజేపీ

వివాదాస్పద పాస్టర్‌ను రాహుల్ కలుసుకోవడం, పాస్టర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శలు గుప్పించారు. శక్తి (హిందూ దేవతలు) తరహాలో కాకుండా జీసస్ మాత్రమే భగవంతుడు అని పాస్టర్ చెప్పడాన్ని నిలదీశారు. గతంలో ఇదే పాస్టర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యారని గుర్తుచేశారు. హిందువులను సవాలు చేసి, బెదరించిన జార్జి పొన్నయ్య ఈరోజు భారత్ జోడో యాత్ర పోస్టర్ బాయ్‌ను కలిశారని, భారత్‌మాత గురించి ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. హిందూవ్యతిరేక భావాలున్న సుదీర్ఘ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని షెహజాద్ పూనావాలా ఓ ట్వీట్‌లో విమర్శించారు. ''భారత్ జోడో విత్ భారత్ టోడో ఐకాన్స్'' అంటూ ఎద్దేవా చేశారు.


రాహుల్ నిజ స్వరూపం ఇదే: సంబిత్ పాత్ర

ఎన్నికల సమయంలో రాహుల్ ఆలయాలకు వెళ్తారని, ఎన్నికల ముగియగానే మరో తరహాలో వ్యవహరిస్తుంటారని, ఆయన నిజస్వరూపం ఏమిటో జార్జి పొన్నయ్యను కలవడం ద్వారా ఇప్పుడు బయటపడిందని బీజేపీ నేత సంబిత్ పాత్ర అన్నారు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదని, కాంగ్రెస్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు.


భారత్ జోడో భయంతోనే బీజేపీ రగడ : జైరామ్ రమేష్

బీజేపీ చేసిన విమర్శలను కాంగ్రెస్ నేత, అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ కొట్టివేశారు. ఆడియోలో ఎవరో ఏదో మాట్లాడితే దానికి రాద్ధాంతం అవసరం లేదని అన్నారు. భారత్ జోడో యాత్ర విజయవంతంగా మొదలుకావడంతో బీజేపీ ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

Updated Date - 2022-09-10T20:30:23+05:30 IST