BSP లోకి SP సీనియర్ నేత అజాంఖాన్?

ABN , First Publish Date - 2022-04-28T01:14:27+05:30 IST

BSP లోకి SP సీనియర్ నేత అజాంఖాన్?

BSP లోకి SP సీనియర్ నేత అజాంఖాన్?

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ తొందరలోనే సైకిల్ వదిలేసి ఏనుగు ఎక్కనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆయనకు అఖిలేష్ పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నది బహిరంగ విమర్శ. అంతే కాకుండా 26 నెలల నుంచి జైలులో ఉన్న ఈ ఎస్పీ సీనియర్ నేతను అఖిలేష్ కలిసింది ఒకే ఒక్కసారి. జైలులో కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నేతలను అజాంఖాన్ కలిసినప్పటికీ ఎస్పీ నేతలను మాత్రం కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఎస్పీ నుంచి బయటికి రావడానికి అజాంఖాన్ సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయని అనుకుంటున్నారు.


78 కేసులు అజాంఖాన్‌పై నమోదు కాగా, 77 కేసుల్లో ఆయనకు క్లీన్ చీట్ వచ్చింది. ఇక చివరి కేసు విచారణ పూర్తి చేసుకున్నప్పటికీ తీర్పు రిజర్వులో ఉంది. ఈ కేసులో కూడా అజాంఖాన్‌కు క్లీన్ చిట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే తొందరలోనే ఆయన జైలు నుంచి వచ్చి మళ్లీ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టనున్నారు. అయితే ఎస్పీని వదిలేసిన తర్వాత ఆయన ఎటువైపు చూడనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా, బహుజన్ సమాజ్ పార్టీవైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


మాయావతిపై బహిరంగంగా అజాంఖాన్ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ.. మాయావతి వైఖరి వల్ల ఆయన బీఎస్పీ వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు బీఎస్పీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ముస్లిం ఓట్లు బీఎస్పీకి రాలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విషయాన్ని మాయావతి ప్రస్తావిస్తూ ముస్లింలు బీఎస్పీకి ఓట్లు వేసి ఉంటే బీజేపీని ఓడించేవాళ్లమని అన్నారు. అంతే కాకుండా బీఎస్పీ నుంచి నసీముద్దీన్ సిద్ధిఖీ నిష్క్రమించిన తర్వాత ఆ పార్టీలో ముస్లిం నాయకత్వం కరువైంది. అజాంఖాన్ వస్తే ఆ ఖాళీని భర్తీ చేయవచ్చని అంటున్నారు.


అజాంఖాన్‌కు సైతం బీఎస్పీ మినహా వేరే ప్రత్యామ్నాయం లేనట్లే కనిపిస్తోంది. బీజేపీలో చేరే అవకాశం ఎంతమాత్రం లేదు. కాంగ్రెస్, ఆర్ఎల్‌డీ పార్టీలు చాలా బలహీనంగా ఉన్నాయి. రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ బీజేపీ, ఎస్పీ తర్వాత బీఎస్పీనే. అంతే కాకుండా బీఎస్పీ జాతీయ పార్టీ హోదా కూడా ఉంది. దీంతో ఆయన బీఎస్పీ వైపే మొగ్గు చూపుతారని అంటున్నారు. అజాంఖాన్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని పార్టీలు తొందరపడుతున్నాయి. కారణం.. యూపీలో 20 శాతం ఉన్న ముస్లింలకు అజాంఖానే అగ్ర నాయకుడు. అయితే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది, జైలు నుంచి వచ్చాకే తెలుస్తుంది.

Updated Date - 2022-04-28T01:14:27+05:30 IST