ఐరోపాలో అణు భీతి..!
ABN , First Publish Date - 2022-03-22T08:10:22+05:30 IST
ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై ఆందోళనలు.. బ్రిటన్‌లో గ్లాస్గోవ్ మీదుగా అణు కాన్వాయ్ ఐరోపాలో అణు బంకర్లకు భారీ ఆర్డర్లు.. ...

ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై ఆందోళనలు.. బ్రిటన్‌లో గ్లాస్గోవ్ మీదుగా అణు కాన్వాయ్
ఐరోపాలో అణు బంకర్లకు భారీ ఆర్డర్లు.. పొటాషియం అయోడైడ్ మాత్రలకు డిమాండ్
డోనెట్స్క్, లుహాన్స్క్లో
2 వేల మంది
చిన్నారుల అపహరణ!
రష్యాకు తరలించిన
ఆ దేశ సైన్యం
ఫేస్బుక్లో ఉక్రెయిన్
విదేశాంగ శాఖ పోస్ట్
లండన్, మార్చి 21: ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో రష్యా అణ్వాయుధాలతో డ్రిల్స్‌కు ఆదేశించడంతో.. ఐరోపా, నాటో దేశాల్లో ‘అణు’ భీతి పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల మద్దతుతో ఉక్రెయిన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తుండడంతో.. రష్యా కింజల్ వంటి హైపర్సోనిక్, అధునాతన క్షిపణులను వినియోగిస్తోంది. ఈ ప్రతిఘటన ఇంకా ముదిరినా.. రష్యాలో ఓటమి భయం నెలకొన్నా.. అది అణు దాడులకు దారితీసే ప్రమాదాలున్నాయనే భయాలు ఇప్పుడు ఐరోపా, నాటో దేశాల్లో పెరుగుతోంది. మరోవైపు బ్రిటన్ కూడా తన ట్రైడెంట్ ఖండాంతర అణు క్షిపణులను అమర్చే వార్హెడ్లను తీరప్రాంతానికి తరలించడంతో భయాందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి. దీంతో.. ఐరోపా దేశాల పౌరులు అణు బంకర్లకు ఆర్డర్లిస్తున్నారు. అణు విస్పోటణం తర్వాత వెలుడే రేడియో ధార్మికత దుష్ప్రభవాల నుంచి తప్పించుకునేందుకు పొటాషియం అయోడైడ్ మాత్రలను కొనుగోలు చేస్తున్నారు. న్యూక్లియర్ బంకర్ల కొనుగోలుకు కుబేరులు ఆసిక్తి చూపుతుండగా.. సాధారణ పౌరులు ‘పొటాషియం అయోడైడ్’ మాత్రలను కొనుగోలు చేస్తున్నారు. న్యూక్లియర్ దాడులు జరిగినప్పుడు.. రేడియేషన్/రేడియో ధార్మికత ప్రభావం నుంచి ఈ మాత్రలు థైరాయిడ్ గ్రంథిని కాపాడుతాయి.
1984లో ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్తు ప్లాంట్ నుంచి రేడియేషన్ విడుదలైనప్పుడు.. ఇలాంటి మాత్రలు అద్భుతంగా పనిచేశాయనే అధ్యయనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌లో వీటి ఆర్డర్లు 50శాతానికి పైగా పెరిగాయని బ్రిటన్ పత్రికలు కథనాలను ప్రచురించాయి. అణు యుద్ధాలు జరిగితే.. తమను, తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు కెనెడా, అమెరికా, ఐరోపా దేశాల్లోని కుబేరులు అణు బంకర్లకు ఆర్డర్లు చేస్తున్నారు. రెసిడెన్షియల్(కొన్ని నెలల పాటు నివాస యోగ్యమైనవి) న్యూక్లియర్ బంకర్ల కోసం వీరు కొన్ని మిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నట్లు సీబీఎస్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ బంకర్లలో సోలార్ చార్జింగ్ వ్యవస్థ ఉంటుంది. ఎయిర్ఫిల్టర్లు, తాగునీరు, చెత్తను తొలగించే ట్యాంకులు, ఇన్ఫ్రారెడ్ కిరణాల నుంచి భద్రతను కల్పించే షీల్డ్స్ ఉంటాయి. టెక్సా్‌సలోని రిసింగ్స్ కంపెనీ నుంచి వీటిని చాలా మంది కొనుగోలు చేస్తుండగా.. స్విట్జర్లాండ్ వీటి ఉత్పత్తిని పెంచింది.
బ్రిటన్‌లో ట్రైడెంట్ వార్హెడ్ల తరలింపు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో సరిహద్దు నాటో దేశాలు అప్రమత్తమవుతున్నాయి. బ్రిటన్‌లోని అల్మెర్మస్టోన్లో ఉన్న అణ్వాయుధాల డిపో నుంచి నాలుగు నుంచి ఆరు వార్హెడ్లను సుమారు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్పోర్ట్లోని రాయల్ నేవీ ఆయుధాగారానికి తీసుకెళ్లారు. శనివారం రాత్రి వీటిని తరలించారని బ్రిటన్ న్యూక్లియర్ వార్హెడ్ల తరలింపుపై నిఘా పెట్టే న్యూక్వాచ్ వెల్లడించింది. ట్రైడెంట్ అణు క్షిపణులను తరలించేందుకు ఈ వార్హెడ్లను వినియోగిస్తారు. అయితే.. ఇలా వార్హెడ్లను తరలించడం సాధారణమేనని న్యూక్వాచ్ చెబుతోంది. ఇప్పటికే అణ్వాయుధాలతో డ్రిల్ నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్‌పై పోరు సాగుతుండడంతో.. ఇటీవల ఆయన సూపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించేందుకు ఆదేశించారు. మూడు రోజులుగా మారియుపోల్, కీవ్లపై ఆ క్షిపణులను ఎక్కుపెడుతున్నారు. ఈ యుద్ధం మరింత ఆలస్యమైతే.. పుతిన్ అణ్వాయుధాలను వాడొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంతోనే పుతిన్ తన మొదటి భార్య, పిల్లలు, ప్రేయసి అలీనా కబయేవా, ఆమె పిల్లల్ని రహస్య ప్రదేశంలోని న్యూక్లియర్ బంకర్లకు తరలించారనే వార్తలు వస్తున్నాయి. రష్యా వద్ద 2 వేల దాకా వ్యూహాత్మక అణ్వాయుధాలున్నాయి. తాను ఓటమిపాలవుతున్నట్లు గ్రహిస్తే.. పుతిన్ ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించే ప్రమాదాలు లేకపోలేదని యుద్ధరంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.