International Booker Prize తొలి భారతీయ విజేతగా గీతాంజలి శ్రీ

ABN , First Publish Date - 2022-05-28T01:00:11+05:30 IST

ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ తొలి భారతీయ

International Booker Prize తొలి భారతీయ విజేతగా గీతాంజలి శ్రీ

లండన్ : ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ తొలి భారతీయ విజేతగా నిలిచారు. ఆమె రాసిన హిందీ నవల ‘రెట్ సమాధి’కి ఆంగ్ల అనువాదం ‘టోంబ్ ఆఫ్ శాండ్’కు ఈ ఘనత దక్కింది. భారతీయ భాషలలో రాసిన పుస్తకాల్లో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం మొట్టమొదటిసారి ఈ పుస్తకానికే దక్కింది. విజేతకు 50 వేల బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్‌లు అందజేస్తారు. 


లండన్‌లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం జరిగిన కార్యక్రమంలో గీతాంజలి శ్రీ  (64) (Geetanjali Shree) మాట్లాడుతూ, తాను చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. తాను రాసిన ‘రెట్ సమాధి’ హిందీ నవలను డైసీ రాక్‌వెల్ (Daisy Rockwell) ఆంగ్లంలోకి అనువదించారని, ఆమెతో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నానని తెలిపారు. ఈ పురస్కారం తనకు లభిస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. దీనిని సాధించగలనని కలలో కూడా అనుకోలేదన్నారు. ఇది చాలా గొప్ప గుర్తింపు అని, తాను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని, ఆనందోత్సాహాల్లో మునిగిపోయానని చెప్పారు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని వివరించారు. 


రెట్ సమాధి/టోంబ్ ఆఫ్ శాండ్‌కు ఈ పురస్కారం లభించడంతో దిగ్భ్రాంతికరమైన సంతృప్తి కలిగిందన్నారు. మనం నివసించే ప్రపంచానికి టోంబ్ ఆఫ్ శాండ్ ఓ స్తుతి గీతమని చెప్పారు. రాబోతున్న ప్రళయం ముంగిట ఆశావాదాన్ని నిలిపే శాశ్వత శక్తి అని వివరించారు. ఈ పుస్తకం మరో విధంగా ఎంత మందికి చేరే అవకాశం ఉండేదో అంత కన్నా ఎక్కువ మందికి ఈ బుకర్ ప్రైజ్ ఈ పుస్తకాన్ని కచ్చితంగా తీసుకెళ్తుందని చెప్పారు. ఇది ఈ పుస్తకానికి తగినది, ప్రయోజనకరం అని తెలిపారు. 


ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ సాధించిన మొదటి హిందీ పుస్తకంగా రెట్ సమాధి/టోంబ్ ఆఫ్ శాండ్ నిలిచిన నేపథ్యంలో ఈ ఘనత రావడానికి సాధనంగా తన పుస్తకం నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అయితే తనకు పూర్వం, ఈ పుస్తకానికి పూర్వం హిందీలో, ఇతర దక్షిణాసియా భాషల్లో సుసంపన్నమైన, విస్తృతమైన సాహితీ సంప్రదాయం ఉందని చెప్పారు. ఈ భాషల్లో కొందరు అద్భుతమైన రచయితల గురించి తెలుసుకుంటే ప్రపంచ సాహిత్యం మరింత సుసంపన్నమవుతుందన్నారు. ఇటువంటి పరస్పర సంబంధాల వల్ల జీవన భాషా పదాలను ప్రయోగించే నైపుణ్యం పెరుగుతుందన్నారు. 


హిందీకి ప్రేమ లేఖ

రెట్ సమాధిని ఆంగ్లంలోకి అనువదించిన డైసీ రాక్‌వెల్‌ అమెరికాలోని వెర్మాంట్‌లో ఉంటున్నారు. ఈ నవలను అనువదించినందుకు ఆమెకు కూడా పురస్కారం లభించింది. ఆమె పెయింటర్, రచయిత్రి కూడా. గీతాంజలి శ్రీతో పాటు డైసీ కూడా ఈ కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. డైసీ మాట్లాడుతూ, ‘హిందీ భాషకు ప్రేమ లేఖ’గా అభివర్ణించారు. 


జడ్జింగ్ ప్యానెల్ ప్రశంసలు

80 ఏళ్ళ వయసుగల ఉత్తరాది మహిళకు సంబంధించిన కథతో కూడిన టోంబ్ ఆఫ్ శాండ్ (Tomb of Sand) ( హిందీలో రెట్ సమాధి-Ret Samadhi) చాలా శక్తిమంతమైనది, ఆహ్లాదకరమైనది, ఆకర్షణీయమైనది అని ఇంటర్నేషనల్ బుకర్ జడ్జీలు వ్యాఖ్యానించారు. 


జడ్జింగ్ ప్యానెల్ చైర్‌పర్సన్ ఫ్రాంక్ విన్నే మాట్లాడుతూ, గీతాంజలి శ్రీ రాసిన రెట్ సమాధి ఆత్మీయ భావనలతో కూడిన భిన్నస్వరాలుగల నవల అని, దానిని డైసీ అద్భుతంగా, ఆకట్టుకునేవిధంగా అనువదించారని, ‘టోంబ్ ఆఫ్ శాండ్’ శక్తి, అతిశయం, సరస సల్లాపాలు, చమత్కారం తమను కట్టి పడేసిందని, మంత్రముగ్ధులను చేసిందని అన్నారు. ఇది భారత దేశం, ఆ దేశ విభజనకు సంబంధించిన ప్రకాశమానమైన నవల అని తెలిపారు. దీనిలోని మంత్రముగ్ధులను చేయగలిగే సరససల్లాపాలు, గొప్ప ఓదార్పు అందరినీ ఆకర్షిస్తాయన్నారు. వర్ణరంజితమైన లోకంలోకి యువత, వృద్ధులు, స్త్రీ, పురుషులు, కుటుంబం, దేశం వెళ్లేలా ఈ నవల చేస్తుందన్నారు. 


వృద్ధ మహిళ కథ

ఈ నవల కథానాయిక 80 ఏళ్ళ వృద్ధ మహిళ. తన కుటుంబ సభ్యుల ఊహకు అందకుండా, పాకిస్థాన్ వెళ్ళాలని పట్టుబడతారు. తన బాల్యంలో దేశ విభజన జరిగిన సమయంలో తాను ఎదుర్కొన్న కష్టనష్టాలకు పరిష్కారం దక్కలేదనే బాధ ఆమెలో ఉంటుంది. ఓ తల్లిగా, ఓ కుమార్తెగా, ఓ మహిళగా, ఓ ఫెమినిస్ట్‌గా ఈ భావాలను ఆమె పునఃమూల్యాంకనం చేసుకుంటారు. 


‘రెట్ సమాధి’ 2018లో ప్రచురితమైంది. ‘టోంబ్ ఆఫ్ శాండ్’ 2021 ఆగస్టులో బ్రిటన్‌లో ప్రచురితమైంది. గీతాంజలి శ్రీ మయిన్‌పురిలో జన్మించారు. 


Updated Date - 2022-05-28T01:00:11+05:30 IST