బ్రిటన్ ‘కోబ్రా వారియర్’ విన్యాసాల్లో ఐఏఎఫ్ తేజస్ విమానాలు

ABN , First Publish Date - 2022-02-23T23:17:34+05:30 IST

మన దేశంలో తయారైన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ

బ్రిటన్ ‘కోబ్రా వారియర్’ విన్యాసాల్లో ఐఏఎఫ్ తేజస్ విమానాలు

న్యూఢిల్లీ : మన దేశంలో తయారైన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ సత్తాను ప్రపంచానికి చాటేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) సమాయత్తమైంది. మార్చి 6 నుంచి 27 వరకు బ్రిటన్‌లోని వడ్డింగ్టన్‌లో జరిగే ఎక్సర్‌సైజ్ కోబ్రా వారియర్‌లో ఈ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించబోతోంది. ‘ఎక్స్ కోబ్రా వారియర్ 22’ పేరుతో జరిగే ఈ విన్యాసాల్లో అనేక దేశాల వాయు సేనల విమానాలు పాల్గొంటాయి. 


తేజస్ విమానాలు బ్రిటన్ తదితర దేశాల వాయు సేనల విమానాలతో కలిసి విన్యాసాల్లో పాల్గొంటాయి. బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ అనేక రకాల వాయు సేన కార్యకలాపాల్లో తన సిబ్బందికి వ్యూహాత్మక శిక్షణనిచ్చేందుకు ఈ విన్యాసాలను ఉపయోగించుకుంటుంది. ఈ విన్యాసాల్లో మన దేశం నుంచి 5 తేజస్ విమానాలు పాల్గొంటాయి. దీని వల్ల వాటి కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి వీలవుతుంది. అమెరికా తయారు చేసిన సీ-17 విమానంలో తేజస్ విమానాలను బ్రిటన్‌కు పంపిస్తారు. 


అన్ని వేరియంట్లలోనూ 324 యూనిట్లను సేకరించాలని భారత వాయు సేన ప్రణాళికలు రచించింది. ప్రస్తుతం తేజస్ మార్క్-2 విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అభివృద్ధి చేస్తోంది. ఇవి 2026-27నాటికి సిద్ధమవుతాయని అంచనా. 


Updated Date - 2022-02-23T23:17:34+05:30 IST