Blasting News : భారత్, చైనా దళాల మధ్య తవంగ్‌లో ఘర్షణ... ఇరు వర్గాలకు గాయాలు...

ABN , First Publish Date - 2022-12-12T20:17:56+05:30 IST

దుష్ట చైనా తన దుస్తంత్రాన్ని మళ్లీ ప్రయోగించింది. డోక్లాం, గాల్వన్ ప్రాంతాల్లో ఘర్షణల తర్వాత ఇప్పుడు

Blasting News : భారత్, చైనా దళాల మధ్య తవంగ్‌లో ఘర్షణ... ఇరు వర్గాలకు గాయాలు...
Arunachal Pradesh Tawang

న్యూఢిల్లీ : దుష్ట చైనా తన దుస్తంత్రాన్ని మళ్లీ ప్రయోగించింది. డోక్లాం, గాల్వన్ ప్రాంతాల్లో ఘర్షణల తర్వాత ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని తవంగ్ (Tawang) ప్రాంతంలో భారత సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ సంఘటన డిసెంబరు 9న జరిగినట్లు ఆలస్యంగా వెలుగు చూసిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ ప్రాంతంలో డిసెంబరు 9న భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి కొన్ని ప్రాంతాలు తమవంటే తమవని ఇరు దేశాలు చెప్పుకుంటాయి. తమ ప్రాంతం అని ఇరు దేశాలు చెప్పుకునే ఇటువంటి ప్రాంతాల్లో ఇరు దేశాల దళాలు గస్తీ తిరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితి 2006 నుంచి కొనసాగుతోంది. అదేవిధంగా డిసెంబరు 9న వాస్తవాధీన రేఖ వెంబడి తవంగ్ ప్రాంతంలోకి చైనా దళాలు ప్రవేశించాయి. వారిని భారతీయ దళాలు దృఢంగా ఎదిరించాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇరు దేశాల సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. వెనువెంటనే ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి.

అనంతరం ఈ ప్రాంతంలోని ఇండియన్ కమాండర్ తన చైనీస్ సైనిక కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. అమల్లో ఉన్న నియమ, నిబంధనల ప్రకారం శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించేందుకు చర్చలు జరిపారు.

సుమారు 17,000 అడుగుల ఎత్తున ఉన్న శిఖరాన్ని స్వాధీనం చేసుకునేందుకు చైనాకు చెందిన సుమారు 300 మంది సైనికులు ప్రయత్నించారని, వారిని భారత సైనికులు దీటుగా తిప్పికొట్టారని తెలుస్తోంది. వాస్తవాధీన రేఖను చైనా ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది. వ్యూహాత్మకంగా కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.

Updated Date - 2022-12-12T21:21:47+05:30 IST