ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను రప్పించేందుకు రంగంలోకి వాయు సేన

ABN , First Publish Date - 2022-03-01T17:44:23+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను రప్పించేందుకు రంగంలోకి వాయు సేన

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే చర్యలను భారత ప్రభుత్వం మరింత ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే చురుగ్గా జరుగుతున్న తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం భారత వాయు సేన కూడా ముందుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 


‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను విమానాల ద్వారా రప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కృషిలో భారత వాయు సేన కూడా పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది. వాయు సేన రంగంలోకి దిగితే తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకురావడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోందని తెలిపింది. మరోవైపు మానవతావాద సాయాన్ని మరింత సమర్థవంతంగా అందజేయడానికి కూడా వీలవుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ‘ఆపరేషన్ గంగ’ కోసం మంగళవారం నుంచే సీ-17 విమానాలను వాయు సేన నడిపే అవకాశం ఉందని తెలిపింది. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు స్పైస్‌జెట్ ఓ ప్రత్యేక విమానాన్ని స్లొవేకియాకు మంగళవారం నడుపుతుంది. ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్లొవేకియాకు వెళ్తారు. 


Updated Date - 2022-03-01T17:44:23+05:30 IST