Teesta Setalvad అరెస్టుపై OHCHR వ్యాఖ్యలు సమర్థనీయం కాదు : భారత్
ABN , First Publish Date - 2022-06-30T00:29:07+05:30 IST
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ (Teesta Setalvad) అరెస్ట్‌పై ఐక్య రాజ్య

న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ (Teesta Setalvad) అరెస్ట్‌పై ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ ఆఫీస్ (OHCHR) చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలు భారత దేశ స్వతంత్ర న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడమే అవుతుందని తెలిపింది.
తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ శ్రీకుమార్ అరెస్టులను OHCHR మంగళవారం ఖండించింది. వారిని తక్షణమే విడుదల చేయాలని పిలుపునిచ్చింది. ‘‘తీస్తా సెతల్వాద్, పోలీసు అధికారుల అరెస్టుతో మేం చాలా ఆందోళన చెందుతున్నాం. వారిని తక్షణమే విడుదల చేయాలని పిలుపునిస్తున్నాం. క్రియాశీలకంగా ఉన్నందుకు వారిని అణచివేయరాదు, 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల బాధితులకు సంఘీభావం తెలుపుతున్నాం’’ అని పేర్కొంది.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన మర్నాడు అహ్మదాబాద్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ (డీసీబీ) స్పందించి, గుజరాత్ రిటైర్డ్ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, తీస్తా సెతల్వాద్‌లను అరెస్టు చేసింది. శ్రీకుమార్ పాత్రను కోర్టు ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి (Arindam Bagchi) మాట్లాడుతూ, OHCHR వ్యాఖ్యలు సంపూర్ణంగా సమర్థనీయం కాదన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం భారత దేశ స్వతంత్ర న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని తెలిపారు. ఉల్లంఘనలపై భారత దేశంలోని అధికారులు చర్యలు తీసుకునేటపుడు, సువ్యవస్థీకృతమైన న్యాయ ప్రక్రియలను కచ్చితంగా పాటిస్తారని చెప్పారు. క్రియాశీలత (activism)ను అణచివేసే చర్యలుగా ఇటువంటి న్యాయపరమైన చర్యలపై ముద్ర వేయడం తప్పుదోవపట్టించడమేని, ఆమోదయోగ్యం కాదని తెలిపారు.