స్వతంత్రులకు బీజేపీ, కాంగ్రెస్‌ గాలం

ABN , First Publish Date - 2022-12-07T04:31:25+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి హంగ్‌ తప్పదని వివిధ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో.. ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం ఉన్న స్వతంత్రులపై బీజేపీ, కాంగ్రెస్‌ అప్పుడే కన్నేశాయి.

స్వతంత్రులకు బీజేపీ, కాంగ్రెస్‌ గాలం

హిమాచల్‌లో ‘హంగ్‌’ అంచనాలతో ప్రలోభాలు షురూ

సిమ్లా, డిసెంబరు 6: హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి హంగ్‌ తప్పదని వివిధ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో.. ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం ఉన్న స్వతంత్రులపై బీజేపీ, కాంగ్రెస్‌ అప్పుడే కన్నేశాయి. వివిధ వరాలతో వారిని తమ వైపు ఆకర్షించేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించాయి. అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది సభ్యుల మద్దతు అవసరం. ఏ పార్టీకీ అన్ని స్థానాలు రాకపోవచ్చని, పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నడుమ పోటాపోటీ నెలకొందని.. త్రిశంకు సభ ఏర్పడవచ్చని సోమవారం ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి.

గుజరాత్‌ ఓటింగ్‌ 64.33%.. రేపే ఓట్ల లెక్కింపు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రెండు విడతల ఎన్నికల్లో మొత్తం 64.33% పోలింగ్‌ నమోదైంది. సోమవారం జరిగిన తుది విడత ఎన్నికల్లో 65.30% ఓటింగ్‌ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. గత ఎన్నికల (69.99%) కంటే ఇది 4.69 శాతం తక్కువ. వరుసగా ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. ఏడోసారి కూడా విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. దానికి కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) గట్టి సవాలే విసురుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం బీజేపీ విజయం ఖాయమని అంచనా వేస్తున్నాయి. గుజరాత్‌తో పాటు హిమాచల్‌లోనూ గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

Updated Date - 2022-12-07T04:31:26+05:30 IST