వాట్సాప్‌లో వాచాలత.. సౌదీలో నలుగురికి జైలుశిక్ష!
ABN , First Publish Date - 2022-10-17T09:55:21+05:30 IST
సౌదీకి వెళితే అక్కడ వాట్సా్‌పలో ఇష్టమొచ్చినట్లు చాటింగ్ చేస్తే కష్టాలు తప్పవు! కొన్నిసార్లు కటకటాల వెనక్కీ వెళ్లే ప్రమాదం ఉంటుంది!
- మతపరమైన ఉద్రిక్తత రేగేలా వ్యాఖ్యలుండటమే కారణం
- 5నెలల 5రోజుల కారాగారవాసం..నలుగురూభారతీయులే
(గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సౌదీకి వెళితే అక్కడ వాట్సా్‌పలో ఇష్టమొచ్చినట్లు చాటింగ్ చేస్తే కష్టాలు తప్పవు! కొన్నిసార్లు కటకటాల వెనక్కీ వెళ్లే ప్రమాదం ఉంటుంది! అక్కడ కాలక్షేపానికి నలుగురు కలిసి వాట్సాప్ గ్రూప్‌లో చేసిన చాటింగ్.. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం వారిని జైలుపాల్జేసింది. సౌదీలోని అభాలో ఒక సంస్థలో పనిచేసే ముగ్గురు ప్రవాసీయులు మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే విధంగా ఉన్న వ్యాఖ్యలు చేయగా దాన్ని మరో వ్యక్తి రికార్డు చేసి వాట్సా్‌పలో పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడం.. పోలీసులు తీవ్రంగా పరిగణించి అరెస్టు చేయడం.. కోర్టు దాకా వెళ్లడంతో వారికి 5 నెలల 5 రోజుల శిక్ష, వెయ్యి రియాల్స్ జరిమానా పడింది. శిక్షా కాలం పూర్తయినా జరిమానా చెల్లించేందుకు వారి వద్ద డబ్బు లేకపోవడం, చెల్లించేందుకు బంధుమిత్రుల్లో ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వారు జైల్లోనే మగ్గుతున్నారు. వీరి గురించి జైలు అధికారులు ఉన్నతాధికారులకు వివరించగా వారు జరిమానా రూపంలో ఆ డబ్బును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేవిధంగా ఏర్పాటు చేశారు. ఫలితంగా నలుగురి విడుదలకు మార్గం సుగమం అయింది. గల్ఫ్ దేశాల్లో ఇస్లామిక్ చట్టాలు అమల్లో ఉండటంతో సహజంగా ధార్మికతకు సంబంధించిన అంశాలపై చేసే వ్యాఖ్యల పరంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలున్నాయి.