The Kashmir Files: ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’లో అన్నీ నిజాలే

ABN , First Publish Date - 2022-11-30T02:54:30+05:30 IST

‘‘ద కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలోని ఒక్క సన్నివేశమైనా.. ఒక్క డైలాగ్‌ అయినా అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను సినీరంగం నుంచి తప్పుకొంటా.

The Kashmir Files: ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’లో   అన్నీ నిజాలే

తప్పని నిరూపిస్తే సినీ రంగం నుంచి తప్పుకొంటా

నిజాలు చెబితే.. అబద్ధాలను సృష్టించేవాళ్లుంటారు

‘ఇఫీ’లో ఇజ్రాయెల్‌ దర్శకుడి వ్యాఖ్యలపై.. స్పందించిన బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి

ముంబై/పణాజి, నవంబరు 29: ‘‘ద కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలోని ఒక్క సన్నివేశమైనా.. ఒక్క డైలాగ్‌ అయినా అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను సినీరంగం నుంచి తప్పుకొంటా. ఇంకెప్పుడూ సినిమాలు తీయను’’ అని బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఉద్వేగంగా అన్నారు. ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ గానీ.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తుక్డేగ్యాంగ్‌, అర్బన్‌ నక్సల్స్‌ లేదా ఉగ్రవాదులు కశ్మీర్‌ ఫైల్స్‌ అబద్ధమని నిరూపించాలని సవాల్‌ విసిరారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం(ఇఫీ)లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఇజ్రాయెల్‌ దర్శకుడు, ఇఫీ జ్యూరీ హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ ముగింపు వేడుకల్లో విమర్శలు చేశారు. ‘‘ఈ సినిమాను వీక్షించి దిగ్ర్భాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి లాపిడ్‌ వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ.. మంగళవారం ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్‌ దర్శకుడి వ్యాఖ్యలపై తాను వెనక్కి తగ్గేదేలేదన్నారు. ‘‘నిజం అనేది చాలా ప్రమాదకరమైనది.

నిజం అనేది ప్రజలను అబద్ధాలు చెప్పేలా చేస్తుంది. కశ్మీర్‌ ఫైల్స్‌ ముమ్మాటికీ నిజం. కల్పితం కాదు. కశ్మీరీ పండిట్లపై జరిగిన అత్యాచారాలు, ఊచకోతలు.. వారిని బలవంతంగా కశ్మీర్‌ వీడేలా పన్నిన పన్నాగం అంతా నిజం. అలా కశ్మీర్‌ను వీడిన 700 మంది బాధితులతో మాట్లాడాకే.. ఈ చిత్ర కథను రూపొందించా. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం.. ప్రతి డైలాగ్‌ నిజం నుంచి వచ్చినవే’’ అని ఆయన ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. కశ్మీరీ పండిట్ల ఊచకోత.. హిందూ మహిళలపై అత్యాచారాలు.. లాపిడ్‌ చెప్పినట్లు ప్రచారమో.. అసభ్యమో కానేకాదన్నారు. ఈ దారుణాలకు కారణమైన యాసిన్‌ మాలిక్‌ జైల్లో ఉన్నాడని.. కశ్మీర్‌ ఫైల్స్‌ అబద్ధమైతే.. అతడు తన నేరాన్ని ఎలా ఒప్పుకొంటాడని నిలదీశారు. ఇప్పటికీ కశ్మీర్‌లో హిందువులను కళ్ల ముందే చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అనుపమ్‌ఖేర్‌ కూడా లాపిడ్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూరీబోర్డు కూడా లాపిడ్‌ వ్యాఖ్యలపై స్పందించింది. ఆ వ్యాఖ్యలు లాపిడ్‌ వ్యక్తిగతమేనని పేర్కొంటూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, తమ దేశ దర్శకుడు లాపిడ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి నావొర్‌ గిలాన్‌ క్షమాపణలు చెప్పారు. లాపిడ్‌ వ్యాఖ్యలను ఆయన ట్విటర్‌లో ఖండించారు.

Updated Date - 2022-11-30T02:54:31+05:30 IST