పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు...IMD warns
ABN , First Publish Date - 2022-06-10T16:19:22+05:30 IST
రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది....

న్యూఢిల్లీ: రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది.రానున్న రెండు రోజుల్లో గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలపై రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. మే 29వతేదీన కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు దక్షిణ, మధ్య అరేబియా సముద్రం, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. మే 31 నుంచి జూన్ 7వతేదీల మధ్య రుతుపవనాలు మొత్తం ఈశాన్య ప్రాంతాలను కవర్ చేశాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త ఆర్కె జెనామణి తెలిపారు.
రుతుపవనాలు వచ్చే రెండు రోజుల్లో మహారాష్ట్రకు చేరుకుని, ఆ తర్వాత రెండు రోజుల్లో ముంబయిని కవర్ చేసే అవకాశం ఉందని చెప్పారు. బలమైన రుతుపవనాల ప్రభావం వల్ల బలమైన గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. జూన్ 10-11 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో,రాబోయే ఐదు రోజుల్లో అసోం, మేఘాలయలో భారీ వర్షాలు (204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇది జూన్ 16,జూన్ 22వతేదీల మధ్య రుతుపవనాలు ఉత్తరప్రదేశ్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది.